ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ రాజీనామా చేసి తేజస్వీ యాదవ్ కు పార్టీ పగ్గాలు అప్పగిస్తారని గత కొంత కాలంగా వస్తున్న వార్తలను బీహార్ మాజీ సీఎం రబ్రీ దేవి కొట్టిపారేశారు. అవన్నీ అవాస్తవాలని చెప్పారు. 

కొంత కాలం నుంచి ఆర్డేడీ (RJD) అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి లాలూ ప్ర‌సాద్ (lalu parasa yadav) యాద‌వ్ రాజీనామా చేస్తార‌ని వ‌స్తున్న వార్త‌ల‌పై ఆయ‌న స‌తీమ‌ణి, బీహార్ మాజీ సీఎం ర‌బ్రీదేవి (rabridhevi) తొలి సారిగా స్పందించారు. అలాంటి వార్త‌ల్లో నిజం లేద‌ని తేల్చి చెప్పారు. ఓ కార్య‌క్రమాని హాజ‌రైన ఆమె మీడియాతో మాట్లాడారు. లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ రాజీనామా చేస్తారంటూ మీడియాలో వ‌స్తున్న క‌థ‌నాల‌న్నీ అవాస్త‌వ‌మ‌ని అన్నారు. వాటిని పూర్తిగా ఖండిస్తున్నాని చెప్పారు. 

ప్ర‌స్తుతం లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. హార్ట్, కిడ్నీ సంబంధిత వ్యాధుల‌తో బాధ‌పడుతున్నారు. దీంతో ఆయ‌న అధికంగా ఢిల్లీలోనే ఉంటున్నారు. ఇదీ కాక దాణా కుంభ‌కోణం కేసులో ఆయ‌న జైలుకు వెళ్లే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. దీంతో పాటు రాంచీలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (cbi) కోర్టు డోరాండా ట్రెజరీ అపహరణ కేసులో ఈ నెలలో తీర్పు వెలువరించనుంది. ఈ అన్ని కార‌ణాల వ‌ల్ల లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ రాజీనామా చేస్తార‌ని, వ‌చ్చే వారంలో జ‌రిగే ఆర్జేడీ కార్య‌వ‌ర్గ స‌మావేశంలో ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకుంటార‌ని మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. అదే రోజు లాలూ స‌మ‌క్షంలో తేజస్వీ యాదవ్‌ (tejaswi yadav)కు పట్టాభిషేకం జ‌రిపించి, ఆయ‌న ప‌క్క‌కి త‌ప్పుకుంటార‌నే చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. దీంతో ర‌బ్రీ దేవి స్పందించాల్సి వ‌చ్చింది. 

అయితే ఈ క‌థ‌నాల‌ను లాలూ ప్రసాద్ పెద్ద కుమారుడు, ఎమ్మెల్యే తేజ్‌ప్రతాప్ యాదవ్ (tej prathap yadav) కూడా ఈ ఊహాగానాలను తోసిపుచ్చారు. ఆయ‌న (లాలూ) జాతీయ అధ్యక్షుడని తెలిపారు. ఎప్పుటికీ ఆయ‌న అలాగే కొనసాగుతారని స్ప‌ష్టం చేశారు. అయితే త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశానికి పార్టీ సంస్థాగతానికి సంబంధించిన పలువురు ముఖ్యులు హాజరవుతారని చెప్పారు. కానీ దీనికి లాలు హాజ‌రు అవుతార‌ని మాత్రం చెప్ప‌లేదు. 

ఇదే విష‌యంలో న్యూ ఢిల్లీలో లాలు ప్ర‌సాద్ యాద‌వ్ కూడా స్పందించారు. పార్టీ అధ్య‌క్ష ప‌ద‌విపై వ‌చ్చే వార్త‌ల‌న్నీ ఊహాగానాల‌ని కొట్టిపారేశారు. తేజస్వి యాదవ్‌ను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చేస్తారా అని మీడియా అడిగిన ప్ర‌శ్న‌కు ‘‘ ఇలాంటి వార్తాలను ప్రసారం చేసే వారు మూర్ఖులు ఏం జరిగిందో మేము తెలుసుకుంటాము’’ అని ఆయ‌న స‌మాధానం ఇచ్చారు. 

తేజ‌స్వీకే ఛాన్స్.. ? 
లాలూ ప్రసాద్ యాదవ్ కు ఇద్దరు కుమారులు. ఇందులో ఒక‌రు తేజ‌స్వీ యాద‌వ్ కాగా, మ‌రొక‌రు తేజ్ ప్ర‌తాప్ యాద‌వ్. అయితే లాలూ ప‌లు సంద‌ర్భాల్లో త‌న రాజ‌కీయ వార‌సుడు తేజ‌స్వీ యాద‌వ్ అని తెలిపారు. బీహార్ (bihar)లో 2020లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో తేజ‌స్వీ యాద‌వ్ ఆర్జేడీ ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా అధికారికంగా ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం అత‌ను బీహార్ అసెంబ్లీలో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా కొన‌సాగుతున్నారు. అయితే తేజ్ ప్ర‌తాప్ యాద‌వ్ కూడా ఆర్జేడీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ ప‌లు సంద‌ర్భాల్లో సొంత పార్టీ నేతలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదిలా ఉండ‌గా పార్టీ అధ్య‌క్ష ప‌ద‌విపై క్లారిటీ ఈ నెల 10వ తేదీన జ‌రిగే స‌మావేశంలో క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంది. దీనికి మాజీ సీఎం రబ్రీ దేవి, తేజస్వి యాదవ్, ఇతర సీనియర్ నాయకులు హాజరుకానున్నారు.