లఖింపూర్ ఖేరీ కేసు: అక్టోబరు 3, 2021న లఖింపూర్ ఖేరీలో నలుగురు రైతులతో సహా ఎనిమిది మంది మరణించిన సంఘటనకు సంబంధించి కేంద్ర మంత్రి ఆజ‌య్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా హత్య నేరం కేసును ఎదుర్కొంటున్నారు. 

లఖింపూర్ ఖేరీ కేసు: లఖింపూర్ ఖేరీ హింసాకాండ కేసుకు సంబంధించి కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. తన రెగ్యులర్ బెయిల్ దరఖాస్తును తోసిపుచ్చుతూ అలహాబాద్ హైకోర్టు జూలై 26న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ మిశ్రా దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తులు ఇందిరా బెనర్జీ, ఎంఎం సుందరేష్‌లతో కూడిన ధర్మాసనం పరిశీలిస్తోంది. సెప్టెంబరు 26లోగా సమాధానం ఇవ్వాలని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. "లఖింపూర్ కేసులో నలుగురు రైతులు స‌హా మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. నిందితులు.. కారు అక్క‌డ ఉంది. ఇది అతిపెద్ద వాస్తవం. ఈ కేసు ఘోరమైన నేరం కింద వస్తుంది" అని హైకోర్టు పేర్కొంది.

Scroll to load tweet…

అక్టోబరు 3, 2021న లఖింపూర్ ఖేరీలో నలుగురు రైతులతో సహా ఎనిమిది మంది మరణించిన సంఘటనకు సంబంధించి కేంద్ర మంత్రి ఆజ‌య్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా హత్య నేరం కేసును ఎదుర్కొంటున్నారు. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన వివాదాస్ప‌ద మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాలకు వ్య‌తిరేకంగా దేశ‌వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు కొన‌సాగాయి. ఈ క్ర‌మంలోనే కేంద్రంలోని మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా శాంతియుతంగా ల‌ఖింపూర్ ఖేరీలో ఆందోళన చేస్తున్న రైతులపై కేంద్ర మంత్రి త‌న‌యుడు రైతుల‌పైకి కారును పొనిచ్చార‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. కేసు న‌మోదుచేసుకున్న పోలీసులు.. చాలా ప‌రిణామాల త‌ర్వాత ఆయ‌న్ను అక్టోబరు 9న అరెస్ట్ చేశారు. అయితే, ఫిబ్రవరి 2022లో ఆయ‌న‌కు బెయిల్ ల‌భించింది. 

ఏప్రిల్ 2022లో సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను పక్కనపెట్టి, తాజాగా తన బెయిల్ పిటిషన్‌ను పరిశీలించాలని ఆదేశించడంతో మిశ్రా మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఫిబ్రవరి 10, 2022 నాటి అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వును అత్యున్నత న్యాయస్థానం గతంలో రద్దు చేసి, ఈ అంశాన్ని తిరిగి హైకోర్టుకు రిఫర్ చేసింది. హైకోర్టు ఆదేశాలను కొనసాగించడం సాధ్యం కాదని, దానిని పక్కన పెట్టాలని, ప్రతివాది/నిందితుల బెయిల్ బాండ్లను రద్దు చేయాలని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. వారంలోగా లొంగిపోవాలని మిశ్రాను కోర్టు ఆదేశించింది. మిశ్రాకు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ లఖింపూర్ ఖేరీ ఘటనలో మృతుల కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అంతకుముందు, లఖింపూర్ ఖేరీ హింసాకాండపై దర్యాప్తును పర్యవేక్షించడానికి పంజాబ్-హర్యానా హైకోర్టు రిటైర్డ్ జడ్జి రాకేష్ కుమార్ జైన్ నేతృత్వంలో ఒక కమిటీని సుప్రీంకోర్టు నియమించింది. అయితే, రైతుల ప్రాణాలు పోవడానికి కారణమైన ఆశిష్ మిశ్రా తన రాజకీయ పలుకుబడితో తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారనీ, దీనికి బీజేపీ ప్రభుత్వంలోని నేతల సహకారం కూడా అందుతున్నదనే ఆరోపణలు ఉన్నాయి.