ఉత్తరాఖండ్‌ చమోలీ జిల్లాలో ధౌలిగంగా కారణంగా సంభవించిన మెరుపు వరదలు దేశానికి తీవ్ర విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటి వరకు 31 మంది మృతి చెందగా.. 204 మంది గల్లంతయ్యారు.

ఉత్తరాఖండ్‌ చమోలీ జిల్లాలో ధౌలిగంగా కారణంగా సంభవించిన మెరుపు వరదలు దేశానికి తీవ్ర విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటి వరకు 31 మంది మృతి చెందగా.. 204 మంది గల్లంతయ్యారు.

ఎన్‌టీపీసీ హైడల్‌ ప్రాజెక్ట్‌ తపోవన్‌ సొరంగంలో వీరి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో మరో షాకింగ్‌ న్యూస్ వెలుగులోకి వచ్చింది. వరదల తర్వాత హిమాలయాల్లోని ఓ చోట ‘ప్రమాదకర సరస్సు’ ఏర్పడినట్లు శాటిలైట్‌ చిత్రాల ద్వారా తెలిసింది.

దీంతో అప్రమత్తమైన అధికారులు, సరస్సుకు సంబంధించిన మరింత సమాచారం కోసం విశ్లేషణ జరపడంతోపాటు రాబోయే ముప్పు నుంచి బయటపడేందుకు ప్రణాళికను రూపొందిస్తున్నారు. 

విపత్తు చోటుచేసుకున్న రైనీ గ్రామానికి సమీపంలో ఈ సరస్సు ఏర్పడినట్లు నిపుణులు గుర్తించారు. దాదాపు 350 మీటర్ల పొడవు.. 60 మీటర్ల ఎత్తులో ఈ ప్రమాదకర సరస్సు ఏర్పడినట్లు వెల్లడించారు.

అంతేకాకుండా సరస్సులో నీటిమట్టం క్రమంగా పెరుగుతుంది. ఇది ఇలానే కొనసాగితే మరో విపత్తు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మంచు కరుగుతున్న కొద్ది నీటిమట్టం పెరుగుతోంది. ఫలితంగా సరస్సు ఏ క్షణమైనా ఉప్పొంగి మరోసారి వరదలు సంభవించే ప్రమాదం ఉందట. 

ఈ ప్రమాదకర సరస్సుపై మరింత అధ్యయనం జరిపేందుకు ఇప్పటికే డీఆర్‌డీఓతో పాటు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సాంకేతిక నిపుణుల బృందం ఆ ప్రదేశంలో హెలికాప్టర్‌ సాయంతో ఏరియల్‌ సర్వే నిర్వహించింది. అనంతరం ఈ సరస్సుకు సంబంధించిన సమాచారాన్ని విశ్లేషిస్తున్నాయి.

మరోవైపు సరస్సు విషయంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ స్పందించారు. రైనీ గ్రామానికి సమీపంలో ఏర్పడిన సరస్సు గురించి సమాచారం అందిందని ఇకపై మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అయితే ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని దీనిపై పని చేస్తోన్న శాస్త్రవేత్తలు సూచిస్తున్నారని సీఎం చెప్పారని ఆయన భరోసానిచ్చారు.