తన వ్యక్తిగత జీవితంపై మంత్రులు, బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు కౌంటరిచ్చారు కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామి. మంత్రులకు సిగ్గు, శరం ఉంటే అనవసర విషయాలు ప్రస్తావించకూడదని ఆయన మండిపడ్డారు.

లేదంటే గురివింద సామెతను గుర్తుకు తెచ్చుకుని మాట్లాడాలంటూ కుమారస్వామి నిప్పులు చెరిగారు. కలబుర్గిలో మీడియాతో మాట్లాడిన ఆయన .. మంత్రి సుధాకర్‌  ‘ఏకపత్నీవ్రతుడు’ అంటూ తనపై విమర్శలు చేయడంపై కుమారస్వామి. బీజేపీ మంత్రుల సీడీల వ్యవహారాన్ని జనం ఏ విధంగా చర్చించుకుంటున్నారో గుర్తుంచుకోవాలని చురకలంటించారు. 

ప్రస్తుతం విడుదలైన సీడీతో పాటు మరికొందరి సీడీలు కూడా విడుదల అవుతాయన్న భయంతోనే వారు కోర్టుకు వెళ్లారనే విషయం మరిచిపోవద్దని మాజీ సీఎం హితవు పలికారు. తప్పు చేయకపోతే ఎందుకు కోర్టుకు వెళతారని ఆయన ప్రశ్నించారు.

బీజేపీ నేతలు ఎదుటి వారి తప్పులనే చూపుతారు కాని తమ తప్పులను ఎరగరంటూ కుమారస్వామి ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో కాంగ్రెస్, బీజేపీ నేతల వాగ్యుద్ధాన్ని జనం ఛీత్కరించుకుంటున్నారని దుయ్యబట్టారు.

ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ జనం సమస్యలను గాలికి వదిలివేశారని ఆయన ఎద్దేవా చేశారు. కాగా కుమారస్వామి తొలుత అనితను వివాహం చేసుకున్నారు. అయితే సినీ నటి రాధికను కూడా ఆయన వివాహం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.