ప్రముఖ మలయాళ నటి కేపీఏసీ లలిత మంగ‌ళ‌వారం అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంత కాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.కేపీఏసీ లలిత తన కెరీర్ లో 550కి పైగా సినిమాల్లో న‌టించారు

లెజెండరీ మలయాళ నటి కేపీఏసీ లలిత (KPAC Lalitha) మంగ‌ళ‌వారం మ‌ర‌ణించారు. ప్ర‌స్తుతం ఆమెకు 74 సంవత్స‌రాలు. కొంత కాలంగా ఆనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న ఆమె ఇటీవ‌లే హాస్పిట‌ల్ లో చేరారు. అనంత‌రం ఆమెను కొచ్చిలోని తన కుమారుడైన‌ నటుడు-దర్శకుడు సిద్ధార్థ్ (Siddharth) ఇంటికి తీసుకొచ్చారు. కుమారుడి ఇంట్లోనే ఆమె తుది శ్వాస విడిచినట్లు సమాచారం.

కేపీఏసీ ల‌లిత దివంగత మలయాళ చిత్ర నిర్మాత భరతన్ (Bharathan)ను వివాహం చేసుకున్నారు. ఎంతో కాలంగా మ‌ల‌యాల సినీ ప‌రిశ్ర‌మతో అనుబంధం ఉన్న కేపీఏసీ లలిత అసలు పేరు మహేశ్వరి అమ్మ (Maheshwari Amma). ఐదు దశాబ్దాల పాటు సాగిన తన సినీ కెరీర్‌లో ఆమె 550కి పైగా సినిమాల్లో న‌టించారు. ఆమె నాలుగు కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డులు అందుకున్నారు. అలాగే ఉత్తమ సహాయ నటిగా రెండు నేష‌న‌ల్ ఫిల్మ్ అవార్డులను గెలుచుకున్నారు. 2009 ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్‌లో ఆమె ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు కూడా పొందారు. ఆమె న‌టిగానే కాకుండా కేరళ సంగీత నాటక అకాడమీ చైర్‌పర్సన్‌గా కూడా పనిచేశారు.

కేపీఏసీ లలిత మృతి ప‌ట్ల సినీ ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా ద్వారా సంతాపం ప్ర‌క‌టించారు. ‘‘ శాంతితో విశ్రాంతి తీసుకోండి లలితా ఆంటీ. మీతో నేను వెండితెరను పంచుకోవడం నా అదృష్టం. కేపీఏసీ లలిత నాకు తెలిసిన అత్యుత్తమ నటుల్లో ఒకరు.’’ అంటూ పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ట్వీట్ చేశారు. అలాగే నటి మంజు వారియర్ (Manju Warrier) కూడా ఓ పోస్ట్ లో సంతాపం ప్రకటించారు. 

అలాగే నటి కీర్తి సురేష్ (Keerthy Suresh) కూడా ట్విట్టర్‌లోకి కేపీఏసీ ల‌లిత ఫొటోను షేర్ చేస్తూ.. ‘‘ లెజెండరీ KPAC లలిత ఆంటీ మరణం గురించి వినడం చాలా బాధగా అనిపించింది. వారి కుటుంబానికి నా హృదయపూర్వక సానుభూతి ’’ అంటూ పోస్ట్ రాశారు.