నాగుపాము కాటుకు గురై ప్రాణాలతో పోరాడుతున్న కేరళకు చెందిన ప్రముఖ స్నేక్ క్యాచర్ వావా సురేష్ ( Vava Suresh) నెమ్మదిగా కోలుకుంటున్నారు. సురేష్ ఇప్పుడు స్పృహలోకి వచ్చాడని, బాగానే మాట్లాడగలుగుతున్నాడని వైద్యులు తెలిపారు.
నాగుపాము కాటుకు గురై ప్రాణాలతో పోరాడుతున్న కేరళకు చెందిన ప్రముఖ స్నేక్ క్యాచర్ వావా సురేష్ ( Vava Suresh) నెమ్మదిగా కోలుకుంటున్నారు. కొట్టాయం వైద్యకళాశాలలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం మెరుగుపడటంతో ఈరోజు ఐసీయూ నుంచి వార్డుకు తరలిస్తామని చెప్పారు. సురేష్ తనంతట తానుగా శ్వాస తీసుకోవడం ప్రారంభించడంతో వెంటిలేటర్‌ను గురువారం తొలగించారు. సురేష్ ఆరోగ్య పరిస్థితిపై హాస్పిటల్ మెడికల్ బులిటెన్ విడుదల చేసింది. సురేష్ ఇప్పుడు స్పృహలోకి వచ్చాడని, బాగానే మాట్లాడగలుగుతున్నాడని తెలిపింది. మెదడు పనితీరు సాధారణ స్థితికి వచ్చింది మరియు అతను బాగా శ్వాస తీసుకుంటున్నాడని వెల్లడించింది.
కేరళలో స్నేక్ క్యాచర్ గా పేరు గాంచిన సురేష్ ఇప్పటివరకు 50,000లకు పైగా పాములను రక్షించారు. సురేష్ నేషనల్ జియోగ్రాఫిక్, యానిమల్ ప్లానెట్ ఛానెల్ లలో కూడా పలు వీడియోలు చేశారు. సురేష్‌ని ముద్దుగా ‘Snake man of Kerala’గా పిలుస్తున్నారు. సురేష్ 190కి పైగా కింగ్ కోబ్రాలను రక్షించారు. జనవరి 31వ తేదీన వావా సురేష్ తన వృత్తిలో భాగంగా సోమవారం Kurichi గ్రామంలో ఓ పామును పట్టుకునే ప్రయత్నం చేశాడు. దానిని పట్టుకుని గోనెసంచిలో వేస్తుండగా అది అతని మోకాలిపై కాటేసి తప్పించుకునేందుకు ప్రయత్నించింది.

ఏడున్నర అడుగులు ఉన్న ఆ త్రాచు పాము సురేష్ కుడి కాలి మోకాలి వద్ద కాటేసింది. అయితే పాము కాటును లెక్కచేయకుండా సురేష్ ఆ పామును సంచిలో వేశాడు. వెంటనే కిందపడిపోయాడు.. దీంతో అది గమనించిన స్థానికులు అతనిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే సురేష్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో పరిస్థితి విషమంగా కొట్టాయం మెడికల్ కాలేజ్‌కు తరలించారు. ఇక, ఇప్పటివరకు తనను 250 సార్లు పాము కాటుకు గురయ్యానని సురేష్ ఓ సందర్భంలో చెప్పారు.
సురేష్‌కు సాధ్యమైనంత ఉత్తమమైన చికిత్స అందజేస్తామని కేరళ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. సురేష్ ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేక వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేసినట్టుగా రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సురేష్‌ను పరామర్శించిన రాష్ట్ర మంత్రి వీఎన్ వాసవన్ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ఆయన కోలుకుంటాడనే ఆశాభావం వ్యక్తం చేశారు.
