ఆ తల్లిదండ్రులు తమ కుమార్తెను చాలా ప్రేమగా పెంచుకున్నారు. కూతురిని అపురూపంగా పెంచుకున్నారు. అలాంటి కూతురు వాళ్లకు తెలీకుండా.. మరొకరి ప్రేమలో పడింది. ఆ విషయం వాళ్లు గుర్తించే సమయానికి ఆమె ఓ యువకుడితో పరారయ్యింది. దీంతో.. కూతురు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

కూతురి ఆచూకీ మాత్రం దొరకలేదు. దాదాపు పది సంవత్సరాలు గడిచినా.. కూతురు కనిపించడకపోడంతో వారు ఆశలు వదులుకున్నారు. అలాంటి సమయంలో  తాజాగా వారికి తమ కూతురి ఆచూకీ తెలిసింది. విచిత్రమేమిటంటే.. వారి కూతురు తమ పక్కింటి కుర్రాడితోనే ప్రేమలో పడిందని.. ఈ పది సంవత్సరాలు కూడా తమ పక్కింట్లోనే కూతురు ఉందని తెలుసుకొని వారు షాకయ్యారు. ఈ సంఘటన కేరళలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కేరళలోని పాలక్కాడ్ ప్రాంతానికి చెందిన ఓ యువతి తన టీనేజ్ వయసులో ఉన్నప్పుడే ఓ యువకుడితో ప్రేమలో పడింది. ఇంట్లో చెప్పకుండా ఆ అబ్బాయితో లేచిపోయింది. ఆమె కోసం ఎక్కడెక్కడో గాలించినా ఆచూకీ లభించలేదు.

ఈ క్రమంలో పదేళ్లు గడిచిపోయాయి. ఇంతలో ఓ రోజు పోలీసుల నుంచి ఫోన్‌ వచ్చింది. ‘మీ అమ్మాయి దొరికింది’ అని చెప్పారు. తీరా వెళ్లే సరికి ఆ అమ్మాయితో పాటు మరో అబ్బాయి కూడా ఉన్నాడు. అతడ్ని చూసి షాకయ్యారు. ఎందుకంటే.. అతడు తమ పక్కింటి కుర్రాడే. ఆ అమ్మాయి మరెక్కడికో లేచిపోలేదు! పక్కింటికే వెళ్లింది. ఇన్ని సంవత్సరాలు అక్కడే గడిపింది. 

అబ్బాయి తల్లిదండ్రులకు కూడా విషయం తెలియనంతగా గోప్యత పాటించారు ఆ ప్రేమికులు. ఆ అబ్బాయి.. తన పక్కింటి ప్రియురాలిని.. ఎవరికీ తెలియకుండా తమ ఇంట్లో.. తన గదిలో ఉంచేశాడు. అన్న పానీయాలు తనే అందించే వాడు. తను గదిలో ఉంటే.. లోపల గడియ పెట్టుకునే వాడు.. లేకపోతే.. బయట తాళం వేసేవాడు. 

ఆ గదికి అటాచ్డ్‌ బాత్‌రూమ్‌ కూడా లేకపోవడంతో ఆ అమ్మాయి రాత్రి వేళ కిటికీ నుంచి బయటకు దూకి బాత్‌రూమ్‌కి వెళ్లేదట!  మూడు నెలల క్రితం ఆ అబ్బాయి.. గదిలోని తన ప్రియురాలిని తీసుకుని ఇల్లు వదిలి పారిపోయాడు. అదే ఊళ్లో మరో ఇల్లు అద్దెకు తీసుకుని ఇద్దరూ సహజీవనం చేసేవాళ్లు. ఈ సారి అబ్బాయి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ప్రేమికులిద్దరూ పోలీసులకు పట్టుబడ్డారు.