Asianet News TeluguAsianet News Telugu

Coronavirus: కేర‌ళలో కోవిడ్ ఉప్పెన‌.. నిండుతున్న ఆస్ప‌త్రులు.. డెల్టా, ఒమిక్రాన్ లే కార‌ణం !

Coronavirus: దేశంలో క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ కొన‌సాగుతున్న‌ది. ద‌క్షిణాది రాష్ట్రమైన కేర‌ళ‌లో కోవిడ్‌-19 కేసుల రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. అయితే, రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి ఉప్పెన‌కు క‌రోనా  వైరస్ వేరియంట్లు డెల్టాతో పాటు ఒమిక్రాన్ వ్యాప్తే కార‌ణ‌మ‌ని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ అన్నారు.  
 

Kerala Both Omicron Delta behind Covid-19 surge says health minister
Author
Hyderabad, First Published Jan 19, 2022, 10:40 PM IST

Coronavirus: ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి క‌ల్లోలం రేపుతున్న‌ది. భార‌త్ లోనూ క‌రోనా వైర‌స్ కేసులు క్ర‌మంగా పెరుగుతూనే ఉన్నాయి. నిత్యం ల‌క్ష‌ల్లో కొత్త కేసులు న‌మోదుకావ‌డం వైర‌స్ ఉప్పెన‌కు అద్దం ప‌డుతున్న‌ది. ప‌లు రాష్ట్రాల్లో రోజువారీ కేసులు వేలల్లో న‌మోదుకావ‌డం, ఆస్ప‌త్రుల్లో చేరిక‌లు పెరుగుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ది. దేశంలో క‌రోనా కేసులు (Coronavirus) పెరుగుతున్న రాష్ట్రాల్లో కేర‌ళ ఒక‌టి. ద‌క్షిణాది రాష్ట్రమైన కేర‌ళ‌లో రోజువారీ కేసులు 30 వేల‌కు పైగా న‌మోద‌వుతున్నాయి. దీనికి తోగు ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతున్న‌ది. అయితే, రాష్ట్రంలో క‌రోనా కేసుల ఉప్పెన‌కు ప్ర‌ధాన కార‌ణం కరోనా వైరస్ కొత్త వేరియంట్ తో పాటు ఇదివ‌ర‌కు భార‌త్ లో కోవిడ్-19 సెకండ్ వేవ్ కు కార‌ణ‌మైన డెల్టా వేరియంట్ వ్యాప్తి అధికం కావ‌డ‌మేన‌ని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ (health minister Veena George)  అన్నారు. 

కేర‌ళ‌లో రోజువారీ కేసులు గ‌ణ‌నీయంగా పెరుగుతున్నాయి. గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 34,199 క‌రోనా కేసులు (Coronavirus) న‌మోద‌య్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 1,68,383కు చేరింది. క‌రోనా కేసుల పెరుగుతుండ‌టంతో మళ్లీ ఆస్ప‌త్రుల్లో చేరుతున్న వారి సంఖ్య అధికం అవుతున్న‌ది. రాష్ట్రంలో న‌మోదైన కొత్త కేసుల‌తో క‌లుపుకుని కోవిడ్‌-19 ఇన్‌ఫెక్షన్ల సంఖ్య 54,41,511కు చేరుకుంది. అంత‌కు ముందు రోజు రాష్ట్రంలో 28,481 క‌రోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 91,983 కోవిడ్‌-19 నమూనాలను పరీక్షించామని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ప్ర‌స్తుతం 1.68 లక్షల క్రియాశీల కోవిడ్-19 కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. కొత్త‌గా కోవిడ్ కార‌ణంగా 134 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం క‌రోనా వైర‌స్ కార‌ణంగా చ‌నిపోయిన వారి సంఖ్య 51,160కి చేరుకుంది.

"ప్రస్తుతం, రాష్ట్రంలో (Coronavirus) 1,68,383 క్రియాశీల COVID-19 కేసులు ఉన్నాయి, వాటిలో 3.2 శాతం మాత్రమే ఆస్పత్రులలో చేరాయి" అని ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త కేసుల్లో అత్య‌ధికం ఎర్నాకులంలో  5,953 కొత్త కేసులు, తిరువనంతపురం 5,684, కోజికోడ్‌లో 3,386 కేసులు నమోదయ్యాయి.
కొత్త‌గా క‌రోనా బారిన‌ప‌డ్డ వారిలో 283 మంది ఆరోగ్య కార్యకర్తలు కూడా ఉన్నారు. ఇదే స‌మ‌యంలో క‌రోనా నుంచి 8,193 మంది కోలుకున్నారు. దీంతో కేర‌ళ‌లో క‌రోనా నుంచి రిక‌వ‌రీ అయిన వారి సంఖ్య 52,44,206కు చేరుకుంది.

రాష్ట్రంలో ప్ర‌స్తుత (Coronavirus) ప‌రిస్థితుల‌పై కేర‌ళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ (health minister Veena George) మాట్లాడుతూ.. రాష్ట్రంలో క‌రోనా ఉప్పెన‌కు కోవిడ్‌-19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తో పాటు ప్ర‌మాద‌క‌ర‌మైన డెల్టా వేరియంట్ కూడా కార‌ణ‌మ‌ని అన్నారు. COVID-19 థ‌ర్డ్ వేవ్‌ను కేరళ చూస్తోందని ధృవీకరిస్తూ..  "సూపర్-స్ప్రెడ్" కి వ్యతిరేకంగా ప్రజలను హెచ్చరించారు. క‌రోనా వైర‌స్ డెల్టా, ఓమిక్రాన్ రకాలు రెండూ గ‌ణ‌నీయంగా పెరుగుద‌ల‌కు కార‌ణమ‌వుతున్నాయ‌ని అన్నారు. ఒమిక్ర‌న్ తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ, డెల్టా వేరియంట్ కంటే Omicron వేరియంట్ 5-6 రెట్లు ఎక్కువగా వ్యాధిని వ్యాప్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది కాబట్టి దీనిని తేలికగా తీసుకోవ‌ద్ద‌ని సూచించారు. మహమ్మారిని అదుపులో ఉంచేందుకు ప్రతి ఒక్కరు కోవిడ్ ప్రోటోకాల్‌ను ఖచ్చితంగా పాటించాలని అన్నారు.

ఇదిలావుండ‌గా, ఆస్ప‌త్రుల్లో ప‌డ‌క‌లు క‌రోనా (Coronavirus) రోగుల‌తో నిండిపోతున్నాయి. బుధ‌వారం కొత్త‌గా 1094 మంది అడ్మిట్ అయ్యారు. జ‌న‌వ‌రి 1న కేర‌ళ‌లో 2,435 క‌రోనా కేసులు న‌మోదు కాగా, 169 మంది ఆస్ప‌త్రుల్లో చేరారు. అయితే, 19 రోజుల్లో రోజువారీ కేసుల సంఖ్య 34 వేలు, రోజువారీ అడ్మిట్ల సంఖ్య వెయ్యిని దాటింది. గ‌త రెండు వారాల్లో ఆస్పత్రుల్లో చేరుతున్న క‌రోనా రోగుల సంఖ్య 60 శాతం మేర పెరిగింది.

Follow Us:
Download App:
  • android
  • ios