హోరాహోరీగా జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభంజనం సృష్టించింది. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్  మూడోసారి ఢిల్లీ పీఠం అధిరోహించారు. ఆదివారం ఆయన ఢిల్లీ  ముఖ్యమంత్రిగా ముచ్చటగా మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు. కాగా... ఈ ప్రమాణస్వీకారానికి ఓ ముఖ్య అతిథిగా బుల్లి మఫ్లర్ మ్యాన్ వచ్చాడు. 

ఎన్నికల ఫలితాలు విడుదల రోజు... తలకు టోపీ, మెడకు మఫ్లర్ పెట్టుకొని ఓ చిన్నారి ఫోటో వైరల్ అయ్యింది మీకు గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఆ బుడతడినే.. ముఖ్య అతిథిగా ఆహ్వానించగా.. వచ్చి సందడి చేశాడు. 

Also Read పాటతో అదరగొట్టిన సీఎం కేజ్రీవాల్.. వీడియో వైరల్...

పూర్తి వివరాల్లోకి వెళితే... కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఢీకొట్టి మరి కేజ్రీవాల్ విజయం సాధించడంతో ఆయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. సమయానికి తగ్గట్టుగా పొదుపుగా మాట్లాడే అరవింద్ కేజ్రీవాల్‌ అనగానే ముందుగా గుర్తొచ్చేది ఆయన మఫ్లరే.

దేశ రాజధానిలో చలిని తట్టుకునేందుకు గాను కేజ్రీవాల్ పైన టోపీ పెట్టి, తల చుట్టూ మఫ్లర్ ధరిస్తారు. దీనిపై ఆయన రాజకీయ ప్రత్యర్థులు జోకులు, కామెంట్లు వేస్తూ ఉంటారు కూడా. అంతలా పాపులరైన కేజ్రీవాల్ మఫ్లర్ వేషం వేసుకుని ఓ చిన్నారి అందరినీ ఆకట్టుకున్నాడు.

ఢిల్లీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమవ్వడానికి కొద్దిసేపటి క్రితం ఆప్ ఈ బుడ్డోడి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘‘మఫ్లర్ మ్యాన్’’ అంటూ దీనికి క్యాప్షన్ ఇచ్చింది. దీనిపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు.

ఆ బుల్లి మఫ్లర్ మ్యాన్ ఫోటో ఫుల్ ట్రెండ్ అయ్యింది. లక్షల్లో లైకులు, వేలల్లో కామెంట్స్ వచ్చి పడ్డాయి. దీంతో... ఆ బుడ్డోడు వైరల్ అయ్యాడు. అయితే... ఇప్పుడు ఆ బుజ్జి మఫ్లర్ మ్యాన్ ని ముఖ్య అతిథిగా ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నట్లు ఆప్ ప్రకటించింది. వారి ఆహ్వానాన్ని మన్నించి.. ఆ బుజ్జి హీరో కూడా అక్కడకు వచ్చేశాడు.

ఈవెంట్‌లో చిన్నారి సెంటర్‌ ఆఫ్‌ ఆట్రాక్షన్‌గా నిలవడంతో పిల్లవాడితో సెల్ఫీలు దిగేందుకు జనాలు ఎగబడ్డారు. ఈ చిన్నారిని తమ కెమెరాల్లో బంధించేందుకు మీడియా సైతం ఆసక్తి చూపింది. ఇక ఆప్‌ ఎమ్మెల్యేలు భగవత్‌మాన్‌, రాఘవ్‌ చద్దా, సోమ్‌నాథ్‌ భారతి వంటి వారు కూడా పిల్లాడితో ఫోటోలు దిగి ముద్దు చేశారు. అదే విధంగా మరికొంత మంది చిన్నారులు కూడా కేజ్రీవాల్‌ను అనుకరిస్తూ దుస్తులు ధరించి కార్యక్రమానికి వచ్చి ప్రత్యేకంగా నిలిచారు