అఖిల భారత స్థాయి సర్వీసుల్లో అత్యున్నత హోదాగా చెప్పుకునే ఐఏఎస్‌ను సాధించాలని చాలామంది యువత కల. దీని కోసం జీవితాలను త్యాగం చేసినవారున్నారు. అలాంటిది ఐఏఎస్ టాపర్‌గా ఎంపికైతే అది మాటల్లో చెప్పలేం కదా.. అంతటి గౌరవాన్ని సంపాదించిన వ్యక్తి ఉద్యోగానికి రాజీనామా చేస్తే.. షాక్‌గా ఉంటుంది కదా..

జమ్మూకశ్మీర్‌కు చెందిన షా ఫెసల్ 2009 ఐఏఎస్ టాపర్.. ‘‘రాష్ట్రంలో అడ్డూ అదుపు లేకుండా సాగుతున్న కశ్మీరీ పౌరుల హత్యాకాండాకు నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించారు. ‘‘నాకు ఉద్యోగం కన్నా.. కశ్మీరీల జీవితాలు ముఖ్యం.. ప్రజలకు చేరువయ్యేందుకు కేంద్రం నుంచి ఎలాంటి సహకారం లేదు.. చిత్తశుద్ధి లేదు, హిందుత్వ శక్తుల చేతిలో దేశంలోని దాదాపు 20 కోట్ల ముస్లింల సామూహిక హననం సాగుతోంది.

ముస్లింల ప్రాధాన్యం తగ్గించేలా, వారిని అసలు లేకుండా చేసే కుట్ర సాగుతోంది. వారిని ద్వితీయ శ్రేణి పౌరులుగా దిగజారుస్తున్నారు..ప్రత్యేక ప్రతిపత్తి ఉన్న రాష్ట్రంపై దారుణమైన దొంగదెబ్బ తీస్తున్నారు. అతివాద జాతీయవాదం పేరిట ఇతర మతాల పట్ల ద్వేషం పెంచుతున్నారంటూ ఆయన ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్ట్ రాజకీయంగా కలకలం రేపుతోంది.  

బీజేపీ పేరెత్తకుండా దాడి చేస్తూ.. సీబీఐ, ఆర్బీఐ, ఎన్ఐఏ వంటి వ్యవస్థల విధ్వంసం వెనుక దేశ రాజ్యాంగ సౌధాన్ని కూల్చే యత్నం సాగుతోందన్నారు. నిజమైన ప్రజాస్వామ్యం నెలకొనాలంటే ప్రశ్నించే గళాలను అణగదొక్కరాదు.. ఇకపై సివిల్ సర్వీసెస్‌కు వెళ్లాలనుకునేవారికి శిక్షణనిచ్చి తన కల నెరవేర్చుకుంటా అని ఫైసల్ పేర్కొన్నారు.

కొద్దిరోజుల క్రితం విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన ఫైసల్ పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఆయన త్వరలో రాజకీయాల్లోకి చేరవచ్చుననే వాదన వినిపిస్తోంది. నేషనల్ కాన్ఫరెన్స్‌ నేత మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్ధుల్లా ఆయన పోస్ట్‌పై ట్వీట్ చేయడం ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తోంది. ‘‘బ్యూరోక్రసీకి నష్టమైనది రాజకీయాలకు లాభమవుతుంది.. వెల్‌కమ్ అని ఒమర్ వ్యాఖ్యానించారు.