కోవిడ్ 19 బారినపడుతున్న రాజకీయ నాయకుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా కర్ణాటక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి బి.శ్రీరాములు కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలియజేశారు.

తనలో వైరస్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేసుకోగా, పాజిటివ్ అని నిర్థారణ అయినట్లు శ్రీరాములు వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి ప్రారంభమైన నాటి నుంచి జిల్లాల్లో పర్యటిస్తూ కరోనా రోగులకు చికిత్సలు, సౌకర్యాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నానని ఆయన స్పష్టం చేశారు.

ఈ క్రమంలో తనకు కూడా వైరస్ సోకడంతో ఆసుపత్రిలో చేరినట్లు శ్రీరాములు ట్వీట్‌లో పేర్కొన్నారు. తనను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా మంత్రి విజ్ఞప్తి చేశారు. అయితే కొద్దిరోజుల క్రితం కరోనా నుంచి మనల్ని దేవుడు తప్ప ఎవరూ కాపాడలేరంటూ శ్రీరాములు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.

మరోవైపు కర్ణాటకలో శనివారం ఒక్కరోజే 7 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడ మొత్తం కేసుల సంఖ్య 1,72,102కి చేరింది. వీరిలో 89,238 మంది డిశ్చార్జ్ కాగా, 3,091 మంది మరణించారు.