కనిపించకుండా పోయిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం. కృష్ణ అల్లుడు, కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్ధ ఏమైయ్యారన్న దానిపై అనేక  అనుమానాలు కలుగుతున్నాయి.

వంతెనపై నడుచుకుంటూ వెళ్లి ఆ తర్వాత కనిపించకుండా పోవడం, కంపెనీ ఉద్యోగులకు లేఖ రాయడంతో సిద్ధార్థ ఆత్మహత్య చేసుకున్నారా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

కాఫీడే ఉద్యోగులు.. కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లకు రాసి లేఖలో సిద్ధార్ధ పలు విషయాలు తెలుపుతూ ఆవేదన వ్యక్తం చేశాడు. 37 ఏళ్ల నా కృషిలో 30 వేలమందికి ప్రత్యక్షంగా.. 20 వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించాను.

అయితే ఇప్పుడు ఎన్నో మంచి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వ్యాపారాన్ని లాభసాటిగా సృష్టించడంలో విఫలమవుతున్నానన్నారు. ఇక తనకు పోరాడే ఓపిక లేదని.. అందుకే అన్ని వదిలేస్తున్నానని.. ఓ ప్రైవేట్ ఈక్విటీలో భాగస్వాములు షేర్లను బైబ్యాక్ చేయమని తనను బలవంత పెడుతున్నారని.. ఇక ఆ ఒత్తిడిని తాను తీసుకోవాలనుకోవట్లేదన్నారు.

ఆదాయపు పన్ను మాజీ డీజీ ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నానని.. తనపై మీరంతా బలంగా ఉండి ఈ వ్యాపారాన్ని ఇలాగే కొనసాగించాలని కోరుతున్నా.. నా తప్పులన్నింటికీ నాదే బాధ్యత.. నా లావాదేవీల గురించి మా మేనేజ్‌మెంట్‌కు, ఆడిటర్లకు తెలియదు.. వాటన్నింటికి నేనే జవాబుదారిని, నేను ఎవరినీ మోసం చేయాలనుకోలేదు. నేనొక అసమర్థ వ్యాపారవేత్తని.. నన్ను క్షమించండి అంటూ సిద్ధార్థ లేఖలో పేర్కొన్నారు.

సోమవారం మంగుళూరు నేత్రావతి నది వంతెనపై వెళుతుండగా డ్రైవర్‌ని కారు పక్కకు ఆపాలని ఆదేశించారు. అనంతరం కారు దిగి వంతెనపై నడుచుకుంటూ వెళ్లారు. సాయంత్రం 6.30 గంటల వరకు ఫోన్‌లో మాట్లాడుతూనే ఉన్నారు.

కొద్దిసేపటి తర్వాత ఆయన కనిపించకుండా పోవడంతో డ్రైవర్ ఆందోళనకు గురయ్యాడు. వెంటనే విషయాన్ని సిద్ధార్థ కుటుంబసభ్యులకు తెలియజేశాడు. వెంటనే సమాచారం అందుకున్న దక్షిణ కన్నడ పోలీసులు నదీ తీరంలో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.

గజ ఈతగాళ్ల సాయంతో నేత్రావతి నదిని జల్లెడ పడుతున్నారు. విషయం తెలుసుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప మంగళవారం ఉదయం ఎస్.ఎం కృష్ణ నివాసానికి చేరుకుని ఆయనను పరామర్శించారు. కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ సైతం ఆయనను కలిశారు. 

కర్ణాటక మాజీ సీఎం అల్లుడు అదృశ్యం: వంతెనపై నడుస్తూ మాయం