కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం. కృష్ణ అల్లుడు, కేఫ్ కాఫీ డే అధినేత వి.జి. సిద్ధార్థ అదృశ్యమయ్యారు. సోమవారం మంగుళూరు నేత్రావతి నది వంతెనపై వెళుతుండగా డ్రైవర్‌ని కారు పక్కకు ఆపాలని ఆదేశించారు.

అనంతరం కారు దిగి వంతెనపై నడుచుకుంటూ వెళ్లారు. సాయంత్రం 6.30 గంటల వరకు ఫోన్‌లో మాట్లాడుతూనే ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత ఆయన కనిపించకుండా పోవడంతో డ్రైవర్ ఆందోళనకు గురయ్యాడు.

వెంటనే విషయాన్ని సిద్ధార్థ కుటుంబసభ్యులకు తెలియజేశాడు. వెంటనే సమాచారం అందుకున్న దక్షిణ కన్నడ పోలీసులు నదీ తీరంలో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్ల సాయంతో నేత్రావతి నదిని జల్లెడ పడుతున్నారు.

విషయం తెలుసుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప మంగళవారం ఉదయం ఎస్.ఎం కృష్ణ నివాసానికి చేరుకుని ఆయనను పరామర్శించారు. కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ సైతం ఆయనను కలిశారు.