బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పకు మంత్రివర్గం కూర్పు పెద్ద తలనొప్పిగా మారింది. ఎట్టకేలకు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నప్పటికీ సొంత పార్టీలోని కీలక నేతలకు మంత్రి వర్గంలో స్థానం కల్పించకపోవడంతో వారంతా అలకబూనారు. మంత్రి  దక్కకపోవడంతో యడ్డీకి సవాల్ లు విసురుతున్నారు. 

ఇదే అదనుగా చూసుకుని జేడీఎస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. బీజేపీ అసంతృప్త నేతలను తమవైపునకు తిప్పుకునేందుకు పావులు కదుపుతుంది. ఇప్పటికే బీజేపీపై అసంతృప్తితో రగిలిపోతున్న ఎమ్మెల్యేతో జేడీఎస్ ఎమ్మెల్యే రహస్యంగా భేటీ అవ్వడం కలకలం రేపుతోంది. 

యడియూరప్ప తొలికేబినెట్ లో అవకాశం దక్కకపోవడంతో విస్తరణలో అయినా తనకు అవకాశం లభిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చారు బెళగావి జిల్లా హుక్కేరి ఎమ్మెల్యే ఉమేశ్ కత్తి. విస్తరణలో కూడా దక్కకపోతే ఇక ఇంటికే పరిమితమవుతానని హెచ్చరించారు.  

7మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో బెళగావి జిల్లా బీజేపీ ఎమ్మెల్యేలతో ఉమేశ్ కత్తి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తొలి విడత నిరాశ మిగిల్చిం దని మలివిడతలో తప్పని సరిగా కేబినెట్‌లో చేరతానని ఆశిస్తున్నట్లు తెలిపారు. అప్పుడు కూడా దక్కకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఇంటికే పరిమితం అవుతానని యడ్డీకి హెచ్చరించారు. 
 
గత ఎన్నికల్లో తన సోదరుడు రమేష్ కత్తి టికెట్ ఆశించి భంగపడ్డారని అయినా తాను బాధపడలేదని కానీ ఇప్పుడు మంత్రివర్గంలో స్థానం దక్కకపోవడం బాధ కలిగించిందన్నారు.  బెళగావి జిల్లా ఎమ్మెల్యేలతో చర్చకు ముందు తన పదవికి రాజీనామా చేసేందుకు ఉమేశ్ కత్తి రెడీ అయ్యారు. అయితే ఎమ్మెల్యేలంతా బుజ్జగించడంతో వాయిదా వేసుకున్నారు.  

ఇదిలా ఉంటే అసంతృప్తులను తమవైపునకు లాగేందుకు జేడీఎస్‌ రంగం సిద్ధం చేసుకుంది. ఉమేశ్ కత్తి అలకను క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నించింది. అందులో భాగంగా పార్టీ సీనియర్ నేత బసవరాజ్‌ హొరట్టిని రంగంలోకి దింపింది. 

బసవరాజ్ హోరట్టికి ఉమేశ్ కత్తికి మంచి సంబంధాలు ఉండటం గతంలో ఇద్దరూ జేడీఎస్ లోనే పనిచేసిన నేపథ్యంలో ఉమేశ్ కత్తితో బసవరాజ్ భేటీ అయ్యారు. జేడీఎస్ లోకి రావాలనే ఆహ్వానించారు.  

మెుత్తానికి కేబినెట్ కూర్పు అనేది ముఖ్యమంత్రి యడియూరప్పకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టిందని చెప్పాలి. మంత్రి పదవి దక్కలేదని అలిగిన ఎమ్మెల్యేలను ఎలా బుజ్జగించాలో తెలియ సతమతమవుతున్న యడ్డీకి కేబినెట్ మంత్రులు పక్కలో బల్లెంలా తయారయ్యారు. కీలక పోర్టుపోలియో తమకే ఇవ్వాలంటూ మంత్రుల మధ్య పోరు నెలకొనడంతో ఏం చేయాలో తోచక యడ్డీ  తలపట్టుకుంటున్నారు.