హిజాబ్ నిషేధం ఎత్తివేతపై వెనక్కి తగ్గిన కర్ణాటక సీఎం.. ఆ అంశం ఇంకా పరిశీలనలోనే ఉందని వ్యాఖ్య..
హిజాబ్ (Hijab) పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తామని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (karnataka cm siddaramaiah) చేసిన ప్రకటన పై ప్రతిపక్ష బీజేపీ (bjp) నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం కాస్తా వెనక్కి తగ్గింది. తాము ఇంకా దీనిపై పూర్తి నిర్ణయం తీసుకోలేదని సీఎం స్పష్టం చేశారు.
hijab ban row : హిజాబ్ నిషేధంపై ఉన్న ఎత్తివేస్తామని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చేసిన ప్రకటనపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు రావడంతో కాస్తా వెనక్కి తగ్గారు. తాము ఈ విషయంలో ఇంకా ఎలాంటి అధికారిక నిర్ణయమూ తీసుకోలేదని చెప్పారు. రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడంపై నిషేధాన్ని ఎత్తివేసే అంశాన్ని మాత్రమే ప్రభుత్వం పరిశీలిస్తోందని, ప్రభుత్వ స్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
హిజాబ్ నిషేధాన్ని ఎత్తివేయడంపై ఇంకా పూర్తి నిర్ణక్ష్ం తీసుకోలేదని అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘(హిజాబ్ నిషేధాన్ని ఎత్తివేయడంపై) ఎవరో నన్ను ఒక ప్రశ్న అడిగారు. దాన్ని రద్దు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని బదులిచ్చాను.’’ అని అన్నారు. ఈ విద్యా సంవత్సరంలోనే హిజాబ్ నిషేధం అమలు చేస్తారా అనే ప్రశ్నకు బదులిస్తూ.. ప్రభుత్వ స్థాయిలో చర్చించి ప్రకటన చేస్తామని సీఎం చెప్పారు.
విద్యా సంస్థల్లో మతపరమైన హిజాబ్ ధరించడానికి ఎలాంటి ఆంక్షలు లేవని, దుస్తులు, ఆహారం ఎంపిక వ్యక్తిగతమని చెప్పిన మరుసటి రోజే ఆయన ఈ వివరణ ఇచ్చారు. హిజాబ్ పై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రకటన చేసినప్పటి నుంచి ప్రతిపక్ష బీజేపీ నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ కర్ణాటక అధ్యక్షుడు బీవై విజయేంద్ర ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. సిద్ధరామయ్య విద్యా వాతావరణాన్ని చెడగొడుతున్నారని ఆరోపించారు.
లోక్ సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని అన్నారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు గడిచినా మైనార్టీల్లో అక్షరాస్యత, ఉపాధి రేటు ఇంకా 50 శాతమే ఉందని చెప్పారు. మైనారిటీల స్థితిగతులను పెంచడానికి కాంగ్రెస్ ఏనాడూ ప్రయత్నించలేదని విమర్శించారు. బ్రిటిష్ పాలకులు అవలంబించిన విభజించు పాలించు విధానాన్ని కాంగ్రెస్ విశ్వసిస్తోందని ఆరోపించారు,. ఇది బ్రిటిష్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడమేనని అన్నారు.
అంతకు ఆయన ‘ఎక్స్’లో కూడా దీనిపై వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం యువతను మత ప్రాతిపదికన విభజించిందని ఆరోపించారు. విద్యా సంస్థల్లో హిజాబ్ నిషేధాన్ని ఉపసంహరించుకోవాలని సీఎం సిద్ధరామయ్య తీసుకున్న నిర్ణయం మన విద్యా సంస్థల లౌకిక స్వభావంపై ఆందోళనలను రేకెత్తిస్తోందని చెప్పారు. విభజన పద్ధతుల కంటే విద్యకు ప్రాధాన్యమివ్వడం, మతపరమైన ఆచారాల ప్రభావం లేకుండా విద్యార్థులు విద్యపై దృష్టి సారించే వాతావరణాన్ని పెంపొందించడం చాలా ముఖ్యమని తేల్చి చెప్పారు.