తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. వచ్చే వారం పార్టీ పేరు, గుర్తు కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. మరో విలక్షణ నటుడు కమల్ హాసన్ గతంలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కాగా... రజినీ కూడా రాజకీయాల్లోకి అడుగుపెట్టడంతో.. ఈ విషయంపై కమల్ తాజాగా కామెంట్ చేశారు. రజినీతో కలిసి పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.

రజనీకాంత్‌ కోరితే ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేసేందుకు తాను సిద్ధమని మక్కల్‌ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కాంచీపురం జిల్లాల్లో పర్యటించారు. పార్టీని స్థాపించినా సీఎం అభ్యర్థిగా ఉండనని రజనీకాంత్‌ స్పష్టం చేసిన నేపథ్యంలో ఆయనే కోరితే మీరు సిద్ధమేనా అన్న ప్రశ్నకు రజనీ తనను ప్రకటిస్తే అంగీకరిస్తానని బదులిచ్చారు. 

డబ్బులు పంచేందుకు ఆసక్తి చూపే ప్రభుత్వం ప్రజాసమస్యల పరిష్కారంలో ఎందుకు చూపడం లేదని విమర్శించారు.రేషన్‌కార్డుదారులకు ప్రభుత్వం రూ.2,500 ఇస్తోందని.. తాను డబ్బులు కన్నా ప్రజలను విశ్వసిస్తానని చెప్పారు. చిన కాంచీపురంలోని చేనేత కార్మికులను కలుసుకున్నారు. తాను అధికారంలోకి వస్తే చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక పథకాలను ప్రవేశపెడతానని హామీ ఇచ్చారు.