భారత ఆర్మీ, ప్రభుత్వం, ప్రజల పట్ల కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకోవాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కోరారు.

పాకిస్తాన్ కు చెందిన నేతల మాటలను చూసైనా రాహుల్ గాంధీ కళ్లు తెరుచుకోవాలని ఆయన సూచించారు. ఇకనైనా భారత ఆర్మీని తక్కువ చేసి మాట్లాడడం మానుకోవాలని ఆయన కోరారు.

భారత ఆర్మీ విషయంలో రాజకీయాలకు స్వస్థి పలకాలని ఆయన సూచించారు. పాకిస్తాన్ ప్రతిపక్ష నేత అయాజ్ సాధిఖ్ బుధవారం నాడు పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో ప్రసంగిస్తూ  భారత్ కు చెందిన అభినందన్ వర్ధమాన్ విడుదల నాటి పరిస్థితులను గుర్తు చేశాడు.

పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఖురేషీ ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశానికి ప్రతిపక్షాలు హాజరయ్యాయన్నారు. ఈ సమయంలో అభినందన్ ను విడుదల చేయడమే తప్ప తమకు మార్గం లేదని మంత్రి అయాజ్ పేర్కొన్నట్టుగా ఆయన చెప్పారు.

భారత వింగ్ కమాండర్ ను విడుదల చేయకపోతే  భారత్ ప్రతీకారానికి కూడ సిద్దపడే అవకాశం ఉందని పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ బజ్వా భయంతో వణికిపోయారని ఆయన అసెంబ్లీలో ప్రకటించారు.ఈ వీడియోను జేపీ నడ్డా తన ట్విట్టర్ లో పోస్టు చేశాడు. భారత ఆర్మీని బలహీనమైందిగా చూపడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి తెరతీసిందన్నారు. 

సాయుధ దళాలను , వారి ధైర్య సాహసాలను విమర్శించే విధంగా మాట్లాడిందని ఆయన విమర్శించారు.అందుకే భారత ప్రజలు కాంగ్రెస్ ను ఓడించి బుద్ది చెప్పారని నడ్డా అన్నారు.ఇప్పటికైనా రాహుల్ గాంధీ కళ్లు తెరవాలని నడ్డా రాహుల్ కు చురకలంటించారు.