న్యూఢిల్లీ: జేఈఈ మెయిన్స్ ప్రవేశ పరీక్షల్లో టాప్ ర్యాంక్ సాధించిన అభ్యర్ధితో పాటు మరో ముగ్గురిని అస్సాం పోలీసులు అరెస్ట్ చేశారు. తనకు బదులుగా మరొకరి చేత జేఈఈ మెయిన్స్ ప్రవేశ పరీక్షలో టాపర్ రాయించినట్టుగా తేలడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.

జేఈఈ మెయిన్స్ ప్రవేశ పరీక్షలో టాపర్ కు 99.8 శాతం మార్కులు వచ్చాయి. దేశంలోని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశం కొరకు ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
జేఈఈ టాపర్ నీల్ నక్షత్ర దాస్, అతని తండ్రి డాక్టర్ జ్యోతిర్మయి దాస్ తో పాటు మరో పరీక్షా కేంద్రంలో పనిచేసిన ముగ్గురు ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు.

జేఈఈ టాపర్ పరీక్ష రాసిన పరీక్షా కేంద్రంలో విధులు నిర్వహించిన  హమేంద్రనాత్ శర్మ, ప్రంజల్ కలితా, హిరూలాల్ పాఠక్ లను కూడ ఈ కేసులో అరెస్ట్ చేసినట్టుగా గౌహాతి పోలీసులు ప్రకటించారు. నిందితులను గురువారం నాడు స్థానిక కోర్టులో హాజరుపర్చనున్నట్టుగా పోలీసులు తెలిపారు.

అస్సాం రాష్ట్రంలోని అజారా పోలీస్ స్టేషన్ లో జేఈఈ మెయిన్స్ పరీక్షలో టాపర్ కు వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ నమోదైంది.తనకు బదులుగా మరొకరితో జేఈఈ టాపర్  పరీక్ష రాయించినట్టుగా కేసు నమోదు చేశారు.మధ్యవర్తి సహాయంతో జేఈఈ టాపర్ తనకు బదులుగా మరొకరితో పరీక్ష రాయించినట్టుగా పోలీసులు తెలిపారు.

జేఈఈ పరీక్ష నిర్వహించిన పరీక్షా కేంద్రానికి చెందిన పలువురికి ఈ వ్యవహరంతో సంబంధం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషయమై పరిశోధిస్తున్నామని చెప్పారు.ఇది ఒక కేసు కాకపోవచ్చు..  పెద్ద కుంభకోణమే అయి ఉండవచ్చని గౌహాతి పోలీస్ కమిషనర్ ఎంపీ గుప్తా అభిప్రాయపడ్డారు.

మిత్రదేవ్ శర్మ అనే వ్యక్తి ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోషల్ మీడియాలో, వాట్సాప్ చాటింగ్ లో వచ్చిన ఆడియో రికార్డింగ్ ను ఆయన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ప్రస్తావించారు.

జేఈఈ టాపర్... ఈ పరీక్షలో అక్రమాలకు పాల్పడినట్టుగా ఆయన ఆరోపించారు. జేఈఈ టాపర్ కు పరీక్షా కేంద్రంలో ఇన్విజిలేటర్ గా విధులు నిర్వహించిన వారు కూడ సహకరించారని ఆయన ఆరోపించారు.

పరీక్షా కేంద్రంలోకి వెళ్లిన  జేఈఈ టాపర్ జవాబు పత్రంపై తన రూల్ నెంబర్ తో పాటు తన పేరును రాశాడన్నారు. పరీక్షా కేంద్రం బయట మరో వ్యక్తి జవాబులు రాశాడని చెప్పారు.

ఈ ఆరోపణల నేపథ్యంలో పరీక్షా కేంద్రాన్ని సీజ్ చేశారు. ఈ పరీక్షా కేంద్రం  ఉన్న విద్యా సంస్థ యాజమాన్యానికి పోలీసులు సమన్లు పంపారు. ఈ విషయమై అస్సాం పోలీసులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీనికి సమాచారం ఇచ్చారు.