దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీప రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. అమ్మ మరణంతో తెరపైకి వచ్చిన ఆమె రాజకీయాల్లో ఒక వెలుగు వెలుగుతారని విశ్లేషకులు భావించారు.

ఈ క్రమంలోనే 2017 ఫిబ్రవరి 24న ‘‘ ఎంజీఆర్ అమ్మా దీపా పేరవై’’ పేరుతో కొత్త పార్టీని ప్రారంభించారు. అయితే రాజకీయాల్లో ఇమడలేకపోయిన ఆమె ఇకపై రాజకీయాల్లో కొనసాగలేనని.. పార్టీని అన్నాడీఎంకేలో విలీనం చేస్తున్నట్లు మంగళవారం తన ఫేస్‌బుక్‌లో ప్రకటించారు.

తాను మోసపోవడమే రాజకీయాల నుంచి తప్పుకోవడానికి ప్రధాన కారణమని.. తనకు మార్గదర్శకం చేయడానికి సరైన వ్యక్తులు లేరని.. కొందరు తనపై పనిగట్టుకుని బూతు కామెంట్లు చేస్తున్నారని.. ఇంతగా తనపై అసభ్యకర వ్యాఖ్యలు వస్తాయని ఊహించలేదని దీప ఆవేదన వ్యక్తం చేశారు.

మహిళలు రాజకీయాల్లో కొనసాగాలంటే ఇటువంటి బూతు కామెంట్లు కంట్రోల్ చేయాలని ఆమె స్పష్టం చేశారు.