దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణంపై నేటీకి సమాధానం దొరకని ప్రశ్నలు కోసం.. ఆర్ముగస్వామి కమిషన్‌ అన్వేషిస్తోంది. ఈ నేపథ్యంలో జయకు 78 రోజుల పాటు జరిగిన చికిత్సా సమయంలో ఆస్పత్రి ప్రాంగణంలో ఒక్క సీసీ కెమెరా కూడా పనిచేయకపోవడం పలు విమర్శలకు, అనుమానాలకు తావిస్తోంది.

ముఖ్యమంత్రి లాంటి వీవీఐపీ.. అది కూడా జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న జయ ఆస్పత్రిలో ఉంటే అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండాలి. దీనిలో భాగంగా చీమ చిటుక్కుమన్నా తెలుసుకునేందుకు వీలుగా సీసీ కెమెరా నిఘా తప్పనిసరి. మరి అలాంటిది ఆసుపత్రిలోని ఏ ఒక్క కెమెరా కూడా ఎందుకు పనిచేయలేదు అన్న దానిపై ఆర్ముగస్వామి కమిషన్‌ అపోలోను ప్రశ్నించింది.

దీనిపై స్పందించిన అపోలో యజమాన్యం.. జయ చికిత్స సందర్భంగా ఆసుపత్రి కారిడార్లలోని సీసీటీవీలను పోలీసుల సూచన మేరకే ఆపేశామని తెలిపింది. రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఐజీ సత్యమూర్తి ఆదేశాల మేరకే ఇలా చేశామని అపోలో గ్రూప్ న్యాయవాది అఫిడవిట్ సమర్పించారు.

వైద్య పరీక్షలు నిర్వహించేందుకు జయను గది నుంచి బయటకు తీసుకొచ్చిన సమయంలో కారిడార్లలోని సీసీటీవీలను ఆపేయడంతో పాటు మెట్లదారిని మూసివేశామని న్యాయవాది తెలిపారు. అలాగే లిఫ్ట్ ద్వారా ఆమెను వేరే అంతస్తులోకి తరలించాల్సి వస్తే మిగతా లిఫ్టులను నిలిపివేసేవాళ్లమన్నారు. జయలలితను తిరిగి వార్డ్‌కు తరలించగానే సీసీ కెమెరాలను ఆన్ చేసేవాళ్లమని పేర్కొన్నారు.