భారత్‌లో అక్రమంగా ప్రవేశించడానికి యత్నించిన ముగ్గురు చొరబాటుదారులను (intruders) భారత సైన్యం మట్టుబెట్టింది. వారి వద్ద నుంచి భారీగా డ్రగ్స్ కూడా స్వాధీనం చేసుకుంది. 

భారత్‌లో అక్రమంగా ప్రవేశించడానికి యత్నించిన ముగ్గురు చొరబాటుదారులను (intruders) భారత సైన్యం మట్టుబెట్టింది. సరిహద్దు వద్ద డ్రగ్స్‌ను స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్న వారిని సరిహద్దు భద్రతా దళం సిబ్బంది కాల్చి చంపారు. వారి వద్ద నుంచి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకుంది. ఈ ఘటన జమ్మూ కశ్మీర్‌ సాంబాలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద చోటుచేసుకుంది. ఈ విషయాన్ని Border Security Force ధ్రువీకరించింది. సాంబాలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద ముగ్గురు చొరబాటుదారులను అంతమొందించినట్టుగా బీఎస్‌ఎఫ్ తెలిపింది. వారి నుంచి 36 హెరాయిన్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ. 180 కోట్లు ఉంటుందని అంచనా. 

‘ఫిబ్రవరి 6 తెల్లవారుజామున BSF జమ్మూ హెచ్చరిక దళాలు సాంబా అంతర్జాతీయ సరిహద్దు ద్వారా మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నిస్తున్న 3 పాక్ స్మగ్లర్లను మట్టుబెట్టాయి. 36 ప్యాకెట్లు (సుమారు 36 కిలోలు) మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి. ఆ ప్రాంతంలో ఇంకా సెర్చ్ కొనసాగుతుంది’ అని బీఎస్‌ఎఫ్ ప్రకటనలో పేర్కొంది. 

PTI నివేదిక ప్రకారం.. BSF జవాన్లు తెల్లవారుజామున 2:30 గంటలకు స్మగ్లర్ల కదలికను గుర్తించారు. ఆ తర్వాత జరిగిన కాల్పుల్లో ముగ్గురు స్మగ్లర్లు మరణించారని BSF డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ SPS సంధూ చెప్పినట్లు సమాచారం. 

ఇదిలా ఉంటే జమ్మూ కశ్మీర్‌‌లోని జకురా ప్రాంతంలో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిని లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్‌కు చెందినవారిగా గుర్తించారు. ‘చనిపోయిన ఉగ్రవాదులను కుల్గామ్‌లోని కుజెర్ ఫ్రిసాల్‌కు చెందిన ఇఖ్లాక్ అహ్మద్ హజామ్, పుల్వామాలోని మలంగ్‌పోరాకు చెందిన ఆదిల్ నిసార్ దార్‌గా గుర్తించారు. వీరిద్దరూ లష్కరే తోయిబాకు చెందిన టీఆర్ఎఫ్ సంస్థతో సంబంధం కలిగి ఉన్నారు" అని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ తెలిపారు.

ఉగ్రవాదుల ఉనికికి సంబంధించి విశ్వసనీయ సమాచారం ప్రకారం .. శ్రీనగర్‌లోని రంగ్‌పోరా జకురా ప్రాంతంలో భద్రతా దళాలు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ సమయంలో బలగాలు అనుమానాస్పద ప్రదేశం వైపు వెళుతుండగా.. అక్కడే దాక్కున్న ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్టుగా పోలీసు వర్గాలు తెలిపాయి. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. వారి చర్యలను సమర్థవంతంగా తిప్పికొట్టారు. ఈ క్రమంలోనే ఇద్దరు ఉగ్రవాదులను పోలీసులు మట్టుబెట్టారు.