ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్ధిక మంత్రి చిదంబరం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో తనను అరెస్ట్ చేసేందుకు సీబీఐ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో... చిదంబరం ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై సర్వోన్నత న్యాయస్థానం బుధవారం విచారణ చేపట్టింది. వాదనల సందర్భంగా చిదంబరానికి బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో బెయిల్ పిటిషన్‌ను జస్టిస్ ఎన్వీ రమణ.. సీజేఐకి పంపారు.

పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలా.. వద్దా అనే దానిపై చీఫ్ జస్టిస్ లంచ్ తర్వాత నిర్ణయించనున్నారు. మరోవైపు సీబీఐకి చిదంబరం తరపు న్యాయవాది లేఖ రాశారు. సుప్రీంకోర్టులో విచారణ పూర్తయ్యే వరకు వేచి చూడాలని లేఖలో పేర్కొన్నారు.

 కాగా.. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో నిందితుడిగా ఉన్న చిదంబరం కోసం సీబీఐ, ఈడీ బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. ఈ కేసులో చిదంబరం తనయుడు కార్తీ కంపెనీల మధ్య రూ.305 కోట్లు చేతులు మారినట్లు సీబీఐ, ఈడీలు ఛార్జీషీట్ దాఖలు చేశాయి.

ఈ కేసులో చిదంబరానికి ఢిల్లీ హైకోర్టు గతంలో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై స్టే విధించింది.. దానిని తాజాగా రద్దు చేసింది. దీనికి తోడు సుప్రీంకోర్టు సైతం సత్వరమే ఈ కేసు వినేందుకు నిరాకరించడంతో చిదంబరం అరెస్ట్ ముంగిట నిలిచారు. ఏ క్షణంలోనైనా ఆయనను అరెస్ట్ చేసేందుకు సీబీఐ సిద్ధంగా ఉంది.

ఐఎన్ఎక్స్ మీడియా కేసు: అజ్ఞాతంలోకి చిదంబరం, గాలిస్తున్న సీబీఐ