ఒకేసారి ఎక్కువ మంది మహిళలు బావి మీద స్లాబ్ ఎక్కేసరికి.. శిథిలావస్థలో ఉన్న స్లాబ్ ఒక్కసారిగా విరిగిపోయింది. దీంతో దానిపై నిలబడిన మహిళలు, బాలికలు బావిలో పడి మునిగిపోయారు.

ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్‌లో బుధవారం రాత్రి హృదయ విదారక ప్రమాదం జరిగింది. పెళ్లి వేడుకలో భాగంగా నిర్వహిస్తున్న పూజల సమయంలో బావి స్లాబ్ విరిగిపోయింది. ఆ సమయంలో అక్కడ పూజలు చేస్తున్న మహిళలు బావిలో పడిపోయారు. ప్రమాదంలో 13 మంది చనిపోయారు. మృతుల్లో ఏడాదిన్నర చిన్నారి, 10 మంది బాలికలు, ఇద్దరు మహిళలు ఉన్నారు. 

రాత్రి 9:30 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. ఘటన జరిగిన గంట తర్వాత అక్కడికి చేరుకున్న అధికారులు అర్థరాత్రి వరకు సహాయక చర్యలు చేపట్టారు. దాదాపు 25-30 మంది మహిళలు గాయపడ్డారు, వారిని సమీపంలోని ఆసుపత్రిలో చేర్చారు. ఈ ఘటన కుషినగర్‌లోని నెబువా నౌరంగియా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

నౌరంగియా స్కూల్ తోలా నివాసి పరమేశ్వర్ కుష్వాహా కొడుకు హల్దీ వేడుక కార్యక్రమం బుధవారం నిర్వహించారు. రాత్రి 9.30 గంటల ప్రాంతంలో 50-60 మంది మహిళలు, బాలికలు కల్యాణోత్సవం కోసం గ్రామం మధ్యలో ఉన్న పాత బావి వద్దకు చేరుకున్నారు. బావిపై స్లాబ్ ఉంది. బావికి మూత పెట్టారు. పూజ సమయంలో మహిళలు స్లాబ్‌ ఎక్కారు. ఒకేసారి ఎక్కువ మంది మహిళలు బావి మీద స్లాబ్ ఎక్కేసరికి.. శిథిలావస్థలో ఉన్న స్లాబ్ ఒక్కసారిగా విరిగిపోయింది. దీంతో దానిపై నిలబడిన మహిళలు, బాలికలు బావిలో పడి మునిగిపోయారు.

ఘటన జరిగినప్పుడు చాలా మంది మహిళలు అక్కడే ఉన్నారు. రాత్రిపూట కావడంతో బాగాచీకటిపడింది. విషయం తెలుసుకొని గ్రామస్థులు అక్కడకు చేరకునే సమయానికి చాలా సమయం పట్టింది. అప్పటికే చాలా మంది మహిళలు నీటిలో మునిగిపోయారు. బావి చాలా లోతుగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగింది. అక్కడికక్కడే 13 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇక చీకటి కారణంగా సహాయకచర్యలు మరింత ఆలస్యమైంది. దీని వల్ల.. సదరు మహిళలను రక్షించడం మరింత కష్టంగా మారింది. గ్రామస్థులు మొబైల్ , వాహనాల హెడ్‌లైట్‌లతో వారి స్థాయిలో రక్షించడానికి ప్రయత్నించారు. అనంతరం పోలీసులు, అధికారులు అక్కడికి చేరుకున్నారు. తర్వాత డైవర్లను పిలిచారు. డైవర్లు అర్థరాత్రి వరకు బావిలో వెతికారు. క్షతగాత్రులందరినీ బావిలో నుంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. అక్కడ 13 మంది మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. నీట మునిగిపోవడం వల్లే.. వారు ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.ఈ ప్రమాదంలో మృతి చెందిన బాలికలు 5 నుంచి 15 ఏళ్లలోపు వారే కావడం గమనార్హం.


ఘటన తర్వాత ఏం జరిగిందో ఎవరికీ అర్థం కావడం లేదని పూజకు వెళ్లిన మహిళలు తెలిపారు. పూజ సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో బాలికలు, మహిళలు పడిపోవడం ప్రారంభించారు. అమ్మాయిలు ఒకరినొకరు పట్టుకోవడానికి ప్రయత్నించారు, కానీ చీకటిగా ఉన్నందున ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. ప్రమాదం జరిగిన 15-20 నిమిషాల పాటు కేకలు మాత్రమే వినిపించాయి. గ్రామస్థులు ప్రమాదస్థలానికి రావడంతో మళ్లీ సహాయక చర్యలు చేపట్టారు. కీనసం చీకటి కాకపోయి ఉంటే.. ఇన్ని మరణాలు జరిగి ఉండేవి కావు అని స్థానికులు అభిప్రాయపడ్డారు.

అంబులెన్స్ కూడా గంట తర్వాత వచ్చింది
ప్రమాదం జరిగిందనే సమాచారం అందిన గంట తర్వాత అంబులెన్స్ అక్కడకు చేరింది. అంబులెన్స్ ఆలస్యం కావడం వల్లే ఇలా జరిగిందని అక్కడి వారు చెబుతున్నారు. అంబులెన్స్ ఆలస్యంగా రావడం వల్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క అంబులెన్స్ రాలేదని గ్రామస్తులు తెలిపారు. ఆ తర్వాత ఆస్పత్రికి వెళ్లగా అక్కడ వైద్యులు లేరని.. డాక్టర్ కూడా చాలా ఆలస్యంగా వచ్చారని వారు చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో చికిత్స అందక చాలా మంది చనిపోయారని వారు వాపోయారు. అదే సమయంలో ఈ విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్థులు వాపోయారు. వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.