లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో హత్రాస్ లో మరణించిన బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఆప్ ఎంపీపై సోమవారం నాడు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఇంక్ పోశాడు.

ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ సోమవారం నాడు మధ్యాహ్నం బాధిత కుటుంబాన్ని పరామర్శించి వచ్చిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకొంది.సంజయ్ సింగ్ నేతృత్వంలోని ఆప్ ప్రతినిధి బృందం సోమవారం నాడు హత్రాస్ బాధిత కుటుంబాన్ని పరామర్శించింది.

మీడియాతో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ మాట్లాడే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకొంది. బ్రోకర్లు ఇక్కడి నుండి వెళ్లిపోవాలని అరుస్తూ ఆ వ్యక్తి ఎంపీపై ఇంకు చల్లాడు. ఈ ఘటన జరిగిన తర్వాత ఎంపీ వెంటనే తన కారులో అక్కడి నుండి వెళ్లిపోయాడు.

ఎంపీ ముఖంతో పాటు ఆయన వేసుకొన్న చొక్కాపై ఇంక్ పడింది. ఈ విషయమై ఎంపీ యూపీ సీఎంను ఉద్దేశించి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. మీరు చాలా పిరికివారు.. నాపై కేసులు పెట్టొచ్చు... జైలుకు పంపొచ్చు.. కానీ హత్రాస్ బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం సాగుతోందని ఆయన చెప్పారు.

ఎంపీపై ఇంకు పోసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన ఎందుకు ఎంపీపై ఇంకు పోశాడనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.