భారతీయ రైల్వేలో దాదాపు 2.5 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం  తెలిపింది. అందులో ఎక్కువ శాతం ‘‘గ్రూప్ సి’’ ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీలు ఉన్నాయని పేర్కొంది.

భారతీయ రైల్వేలో దాదాపు 2.5 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అందులో ఎక్కువ శాతం ‘‘గ్రూప్ సి’’ ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ఈ డేటాను పంచుకుంది. బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోడీ లేవనెత్తిన ప్రశ్నకు సమాధానంగా.. రైల్వేలోని అన్ని జోన్లలో గ్రూప్ సి పోస్టులలో మొత్తం 2,48,895 ఖాళీలు ఉన్నాయని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానమిచ్చారు. గ్రూప్ ఏ, బీలలో మొత్తం 2,070 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో రైల్వేలో మొత్తం ఖాళీల సంఖ్య 2,50,965గా ఉందని పేర్కొంది. 

గరిష్టంగా ఉత్తర జోన్‌లో 32,468, తూర్పు జోన్‌లో 29,869, పశ్చిమ జోన్‌లో 25,597, సెంట్రల్ జోన్‌లో 25,281 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్‌లపై 2023 జూన్ 30 నాటికి మొత్తం 1,28,349 మంది అభ్యర్థులు గ్రూప్ సి పోస్టులకు (లెవల్-1 మినహా) ఎంప్యానెల్ చేయబడ్డారని మంత్రి పేర్కొన్నారు. అదే సమయానికి మొత్తం 1,47,280 మంది అభ్యర్థులు లెవల్-1 పోస్టులకు ఎంప్యానెల్ చేయబడ్డారని తెలిపారు.

భారతీయ రైల్వేలో గ్రూప్ ఏ సర్వీసులకు నేరుగా నియామకాలు ప్రధానంగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) ద్వారా జరుగుతాయని వైష్ణవ్ తెలిపారు. యూపీఎస్‌సీ, డీవోపీటీ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్) లో ఇండెంట్ ఉంచబడిందని కూడా వెల్లడించారు. 2021 డిసెంబర్ 1 నాటికి ఖాళీగా ఉన్న 3.12 లక్షల నాన్ గెజిటెడ్ పోస్టులతో పోలిస్తే.. ప్రస్తుతం రైల్వేలో మొత్తం ఖాళీలు 2.5 లక్షలుగా ఉన్నాయి. 

దేశంలోని అతిపెద్ద ఉపాధి కల్పన సంస్థగా పరిగణించబడుతున్న రైల్వేలో 2023 ఫిబ్రవరి 1 నాటికి మొత్తం 11.75 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు.