ఉక్రెయిన్‌లో దాడులు ఇంకా జరుగుతున్నాయి. అక్కడ స్థానికులు సహా మరెన్నో దేశాల పౌరులు చిక్కుకుని ఉన్నారు. భారత పౌరులు, విద్యార్థుల కోసం ఉక్రెయిన్‌లోని భారత ఎంబసీ మరోసారి సూచనలు చేసింది. కీవ్ నగరంలో వీకెండ్ కర్ఫ్యూ ఎత్తివేశారని, వెంటనే రైల్వే స్టేషన్‌లకు చేరుకుని ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతాలకు తరలివెళ్లాలని తెలిపింది.
న్యూఢిల్లీ: ఉక్రెయిన్(Ukraine) పరిస్థితులు ఇంకా ఆందోళనకరంగానే ఉన్నాయి. ఒక వైపు శాంతి చర్చలు(Peace Talks) జరుగుతున్నా.. మరో వైపు దాడులు, ప్రతిదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే, అక్కడి ఘర్షణాత్మక పరిస్థితుల్లో భారతీయులు చిక్కుకుని ఉన్నారు. వారి యోగక్షేమాలు, వారి తరలింపునకు ఉక్రెయిన్‌లోని భారత ఎంబసీ(Indian Embassy) పలు సూచనలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, రెండో అడ్వైజరీ(Advisory) విడుదల చేసింది.
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో వీకెండ్ కర్ఫ్యూ ఎత్తేశారని ఆ దేశంలోని ఇండియన్ ఎంబసీ తెలిసింది. ఉక్రెయిన్‌లోని భారత విద్యార్థులందరూ రైల్వే స్టేషన్‌లకు తరలి వెళ్లాలని, అక్కడి నుంచి పశ్చిమ ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించింది. ఇలా పౌరుల తరలింపు కోసం ఉక్రెయిన్ ప్రత్యేక రైళ్లను వేసింది.
భారత పౌరులు, విద్యార్థులు శాంతియుతంగా మెలగాలని, కలిసి మెలసి ఉండాలని ఇండియన్ ఎంబసీ సూచనలు చేసింది. రైల్వే స్టేషన్‌లలోనూ పెద్ద మొత్తంలో రద్దీ ఉండవచ్చని వివరించింది. కాబట్టి, రైల్వే స్టేషన్‌లలోనూ భారత పౌరులు, విద్యార్థులు సంయమనంగా, శాంతికాముకంగా మెదులుకోవాలని తెలిపింది. ట్రైన్ల రాకపోకల్లోనూ జాప్యాలు ఏర్పడవచ్చని, కొన్ని సందర్భాల్లో అవి రద్దు కూడా కావచ్చని పేర్కొంది. రైల్వే స్టేషన్‌లలోనూ లాంగ్ క్యూలు ఉండవచ్చని వివరించింది. భారత విద్యార్థులు ఎప్పుడూ తమ పాస్‌పోర్టులు, సరిపడా నగదు, తినడానికి సిద్ధంగా ఉండే మీల్స్‌ను రెడీగా ఉంచుకోవాలని తెలిపింది. సులువుగా ధరించడానికి వీలుండే శీతాకాల డ్రెస్సులు, అత్యవసర సరుకులను, అవి కూడా సులభంగా మోయగలిగే వాటినే ఎంచుకోవాలని వివరించింది. ఎల్లప్పుడూ మీ వస్తువులను ఓ కన్నేసి ఉంచాలని పేర్కొంది.
