చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో త్వరలో ప్రారంభం కానున్న సుదీర్ఘ శీతాకాలంలో ఎలాంటి ఇబ్బంది ఎదురుకాకుండా భారత సైన్యం సిద్ధమవుతోంది. చైనాతో సరిహద్దు వివాదాలు పెరిగిపోతున్న సమయాన లద్దాఖ్‌ ప్రాంతంలో సదా సంసిద్ధంగా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి.

శీతాకాలంలో లద్దాఖ్‌ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు మైనస్‌ డిగ్రీలకు చేరుకుంటాయి. నెలలపాటు లడఖ్‌కు దేశంలోని ఇతర ప్రాంతాలతో రాకపోకలకు ఆటంకం ఏర్పడుతుంటుంది. ఈ నేపథ్యంలో ఆర్మీకి అవసరమైన అన్ని వస్తువులను ఫార్వార్డ్‌ పోస్టుల వద్దకు చేరుస్తున్నట్లు భారత సైన్యం ప్రకటించింది.

ఈ క్రమంలో చైనాతో యుద్ధ అనివార్యమైతే మెరుగైన శిక్షణ పొందిన, మానసికంగా బలవంతులైన భారత సైన్యాన్ని ఎదుర్కొంటారని తెలిపింది. శీతాకాలంలో భారతసైన్యం కార్యాచరణ సరిగా ఉండదని చైనా అధికార మీడియా గ్లోబల్ టైమ్స్ కథనాలు ప్రచురించడంతో ఆర్మీ నార్తర్న్ కమాండ్ స్పందించింది.

 

 

చలికాలం గడిపేందుకు కావాల్సిన సరుకులు, ఇంధనం, ఆయుధాలు, మందుగుండు, టెంట్లు, ఉన్ని దుస్తులు, హీటర్లు, ఆహార పదార్థాల్లాంటివన్నీ సరిపడా అందుబాటులో ఉంచామని మేజర్‌ జనరల్‌ అరవింద్‌ కపూర్ తెలిపారు.

దేశీయంగా తయారైన ఆర్కిటెంట్లు మైనస్‌ 20 డిగ్రీల ఉష్ణోగ్రతను, హై ఆల్టిట్యూడ్‌ టెంట్లు మైనస్‌ 40– 50 డిగ్రీల ఉష్ణోగ్రతను తట్టుకుంటాయన్నారు. లద్దాఖ్‌ ప్రాంతం గుండా రెండు ప్రధాన రహదారులు(మనాలీ– లేహ్, జమ్ము–శ్రీనగర్‌–లేహ్‌) పోతుంటాయి.

 

 

గతంలో చలికాలం రాగానే ఈ రెండు మార్గాలు దాదాపు 6 నెలలు మూతపడేవి. కానీ ప్రస్తుతం మౌలికసదుపాయాలు మెరుగుపరిచి ఈ సమయాన్ని 4నెలలకు తగ్గించినట్లు కపూర్‌ చెప్పారు. అటల్‌ టన్నెల్, డార్చా– నీము– పదమ్‌ రహదారి అందుబాటులోకి వస్తే ఇక లద్దాఖ్‌కు సంవత్సరం పొడుగునా రవాణా సౌకర్యం ఉంటుందని ఆయన వివరించారు.

శారీరకంగా, మానసికంగా యుద్ధరంగంలోకి దూకే భారత బలగాలతో పోలిస్తే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) దళాలు ఎక్కువగా పట్టన ప్రాంతాలకు చెందినవేనని నార్తర్న్ కమాండ్ అధికార ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు.

భారత్ శాంతికాముక దేశమని, ఇరు దేశాల మధ్య మంచి సంబంధాలు ఉండాలనే కోరుకుంటోందని ఆయన తెలిపారు. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోనేందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.

రహదారులు సైతం మంచుతో కప్పబడి ఉన్నటువంటి సవాళ్లతో కూడిన  ప్రదేశాలతో సైతం తట్టుకుని నిలబడగలిగే సామర్ధ్యం భారత సైన్యానికి ఉందని నార్తర్న్ కమాండ్ ప్రతినిధి వెల్లడించారు.

 

 

ఇలాంటి చోట్ల శుత్రువులతో తలపడిన అనుభవం భారత సైనికులకు వుందన్నారు. తక్కువ సమయంలోనే మానసికంగా సిద్ధపడి యుద్ధ రంగంలోకి దూకే సైన్యం ఉండటం భారత్‌కు ఎంతో సానుకూల అంశమని ఆయన చెప్పారు. ప్రపంచం మొత్తానికి ఈ వాస్తవాలన్నీ తెలుసునని నార్తర్న్ కమాండ్ ప్రతినిధి వెల్లడించారు.

మే నెలలో చైనా దూకుడుగా వ్యవహరించినప్పుడే యుద్ధ సామాగ్రిని, సామర్ధ్యాన్ని మరింతగా పెంచుకున్నట్లు చెప్పారు. చైనా సరిహద్దుల్లో ఉన్న పరిస్ధితుల కంటే కఠినమైన, ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్ వద్ద వాతావరణం కూడా భారత సైన్యానికి అనుభవమేనని సైన్యం తెలిపింది.