సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్ధితుల నేపథ్యంలో చైనాకు వార్నింగ్ ఇచ్చారు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్ ఆర్‌కేఎస్ భదౌరియా. సరిహద్దుల్లో చైనా దూకుడుగా వ్యవహరిస్తే.. భారత్‌ కూడా అదే రీతిలో స్పందిస్తుందన్నారు.

డ్రాగన్‌ కుట్రలను తిప్పికొట్టేందుకు భారత సేనలు సంసిద్ధంగా ఉన్నాయని భదౌరియా స్పష్టం చేశారు. ఆదివారం జోధ్‌పూర్‌లో భారత్‌ వాయుసేన, ఫ్రాన్స్‌ వాయు సేన, అంతరిక్ష దళాలు ‘డెసర్ట్‌ నైట్‌-21’ పేరిట సంయుక్తంగా నిర్వహిస్తున్న సైనిక విన్యాసాలను ఆయన శనివారం పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డెసర్ట్‌ నైట్‌-21 ప్రస్తుతానికి కేవలం పశ్చిమ సరిహద్దుల్లో మాత్రమే కొనసాగుతోందని తెలిపారు. తూర్పు సరిహద్దులకు దీన్ని విస్తరించడం లేదని ఆయన స్పష్టం చేశారు.

ఇవి ఇతర దేశాలపై దాడికి సన్నాహకంగా చేస్తున్న విన్యాసాలు కావని... కేవలం ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక రక్షణ సంబంధాలు, సహకారాన్ని బలోపేతం చేయడంలో భాగంగానే సాగుతున్నాయని భదౌరియా చెప్పారు.

ఇప్పటి వరకు ఎనిమిది రఫేల్‌ యుద్ధ విమానాలు భారత్‌కు వచ్చాయని.. మరో మూడు ఈ నెలాఖరుకల్లా భారత్‌కు చేరుకుంటాయని ఎయిర్‌ఫోర్స్ చీఫ్ తెలిపారు. వచ్చే ఏడాది కల్లా అన్ని రఫేల్‌ విమానాలు భారత వాయుసేనలో చేరతాయని.. ఇందుకు సంబంధించి పైలట్లకు సమగ్ర శిక్షణ కొనసాగుతోందని ఆయన వెల్లడించారు.

జోధ్‌పూర్‌లోని వాయుసేన స్థావరంలో జనవరి 20న ప్రారంభమైన డెసర్ట్‌ నైట్‌-21 సైనిక విన్యాసాలు నేటితో ముగియనున్నాయి. ఈ విన్యాసాల్లో ముఖ్యంగా రఫేల్‌ ఆపరేషన్‌, ఇరు దేశాల దళాల మధ్య సమన్వయంపై దృష్టి సారించారు.

ఈ విన్యాసాల్లో.. రఫేల్‌, ఎయిర్‌బస్‌ ఏ-330 మల్టీ రోల్‌ ట్యాంకర్‌ ట్రాన్స్‌పోర్ట్‌, ఏ-400ఎం టాక్టికల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ సహా మొత్తం 175 మంది సైనికుల్ని ఫ్రాన్స్‌ రంగంలోకి దింపగా.. భారత్‌ రఫేల్‌, మిరాజ్‌, సుఖోయ్‌లతో విన్యాసాల్లో పాల్గొన్నాయి. 

కాగా, తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దుల వెంబడి నెలకొన్న ప్రతిష్టంభనను పరిష్కరించుకునేందుకు భారత్‌-చైనాలు నేడు 9వ విడత సమావేశం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భదౌరియా చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకొన్నాయి.