Assembly election 2022: ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో రాజకీయాల రసవత్తరంగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే ముందస్తు పోల్ సర్వేలు తమ అంచనాలను ప్రకటిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందనీ, పంజాబ్ లో ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఇండియా న్యూస్-జన్ కీ బాత్ పోల్ సర్వే అంచనా వేసింది.
Assembly Election 2022: ఫిబ్రవరిలో ఉత్తరప్రదేశ్, మణిపూర్, గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు వేడెక్కాయి. ఈ ఎన్నికలు మినీ సంగ్రామాన్ని తలపిస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అన్ని ప్రధానపార్టీలు పంజాబ్ లో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. అధికారం దక్కించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తూ.. విమర్శలు, ఆరోపణలతో విరుచుకుపడుతుండటంతో రాజకీయాలు కాక రేపుతున్నాయి.
ఇదే క్రమంలోనే ముందస్తు పోల్ సర్వేలు తమ అంచనాలను ప్రకటిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందనీ, పంజాబ్ లో ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఇండియా న్యూస్-జన్ కీ బాత్ పోల్ (India News-Jan Ki Baat Poll) సర్వే అంచనా వేసింది. మొదటి దశ ఓటింగ్ కు ముందు తన తుది ఎన్నికల పోలింగ్ సర్వే ఫలితాల అంచనాలను ఇండియా న్యూస్-జన్ కీ బాత్ పోల్ వివరాలను వెల్లడించింది. ఇండియా న్యూస్- జన్ కీ బాత్ పోల్ అంచనా వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ లో అధికార పార్టీగా ఉన్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ (Yogi Adityanath)నేతృత్వంలోని బీజేపీ (Bjp)మళ్లీ అధికారం దక్కించుకుంటుందని అంచనా వేసింది. ఇక పంజాబ్ లో ఆమ్ ఆద్మీ (AAP) పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ లభిస్తుందని తెలిపింది. అయితే, ఈ సారి ఉత్తరాఖండ్ లో పోరు రసవత్తరంగా ఉంటుందని అంచనా వేసింది.
ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లో బీజేపీకి 228 నుంచి 254 సీట్లు వస్తాయని ఇండియా న్యూస్-జన్ కీ బాత్ పోల్ తుది సర్వే అంచనా వేసింది. 41.3 శాతం నుంచి 43.5 శాతం ఓట్లు బీజేపీకి వస్తాయని పేర్కొంది. ఇక మాజీ సీఎం, సమాజ్ వాదీ అధినేత అఖిలేష్ యాదవ్ నాయకత్వం వహిస్తున్న కూటమికి 35.5 శాతం నుంచి 38 శాతం ఓట్లు పడతాయని అంచనా వేసింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఎస్పీలకు భంగపాటు తప్పదని పేర్కొంది. ఈ రెండింటికీ సింగిల్ డిజిట్ సీట్ల వాటాను అంచనా వేసింది. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో 2017 కంటే బీజేపీకి తక్కువ సీట్లు వస్తాయని తెలిపింది.

పంజాబ్: ఇండియా న్యూస్-జన్ కీ బాత్ ఒపీనియన్ పోల్ (India News-Jan Ki Baat Poll) ప్రకారం.. పంజాబ్ (Punjab)లో వరుసగా 60-66 సీట్లు, 41 శాతం -42 శాతం ఓట్ల వాటాతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అంచనా వేసింది. కాగా, ఆదివారం నాడు చరణ్‌జిత్ సింగ్ చన్నీని ముఖ్యమంత్రిగా ప్రకటించిన కాంగ్రెస్‌కు 33-39 సీట్లు వస్తాయని అంచనా పేర్కొంది. మొత్తంగా కాంగ్రెస్ కు 34-35 శాతం ఓట్లు పడే అవకాశముందని తెలిపింది.

ఉత్తరాఖండ్: 2022 అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరాఖండ్ (Uttarakhand) లో ఈసారి పోరు రసవత్తరంగా ఉంటుందని ఇండియా న్యూస్-జన్ కీ బాత్ పోల్ సర్వే పేర్కొంది. అయితే, ఇక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎక్కువ అవకాశాలున్నాయని తెలిపింది. ఉత్తరాఖండ్ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదనీ, 70 సీట్ల అసెంబ్లీలో 34-39 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని అంచనా వేసింది. కాంగ్రెస్ (Congress) సైతం గట్టి పోటినిస్తుందని తెలిపింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 27-33 సీట్లు కైవసం చేసుకుంటుందని తెలిపింది. మొత్తంగా బీజేపీకి 40 శాతం, కాంగ్రెస్‌కు 38 శాతం ఓట్లు వస్తాయని ఇండియా న్యూస్-జన్ కీ బాత్ ఒపీనియన్ పోల్ సర్వే అంచనా ఫలితాలు పేర్కొన్నాయి.