ఈ శతాబ్దం చివరి నాటికి భారతదేశంలో సగటు ఉష్ణోగ్రత 4.4 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం వుందని దేశంలో కేంద్ర ప్రభుత్వ నివేదిక తెలిపింది. ముఖ్యంగా దేశంలో వేడి గాలుల తీవ్రత మునుపటితో పోలిస్తే 3 నుంచి 4 రెట్లు పెరిగే అవకాశం వుందని పేర్కొంది.

1901-2018 మధ్యకాలంలో భారతదేశ సగటు ఉష్ణోగ్రత 0.7 డిగ్రీల సెల్సియస్ పెరిగింది. గ్రీన్‌హౌస్ వాయువుల కారణంగా భూగోళం వేడెక్కడం వల్లే ఈ పరిణామం చోటు చేసుకుందని కేంద్ర భూ భౌతిక శాఖ తెలిపింది.

ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి హర్షవర్థన్ మంగళవారం ప్రకటించే అవకాశం వుంది. ఈ నివేదికను సెంటర్ ఫర్ క్లైమేట్  చేంజ్ రీసెర్చ్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటరాలజీకి చెందిన పూణే విభాగం రూపొందించింది.

1986- 2015 మధ్య 30 సంవత్సరాల కాలంలో ఒక ఏడాది కాలంలో వెచ్చని రోజు, అతి శీతల ఉష్ణోగ్రతలు  వరుసగా 0.63, 0.4 డిగ్రీల సెల్సియస్‌లు. అయితే ఇవి రాబోయే కాలంలో 55 శాతం, 70 శాతం పెరుగుతాయని అంచనా.

భారతదేశంపై వేసవి ఉష్ణ తరంగాల ఫ్రీక్వెన్సీ 21వ శతాబ్ధం చివరి నాటికి 3 నుంచి 4 రెట్లు అధికంగా ఉంటుందని నివేదిక అంచనా వేసింది. ముఖ్యంగా సింధు నది పరివాహక ప్రాంతాల్లో ఉండే ఉపరితల ఉష్ణోగ్రత, తేమ, వేడి ఒత్తిడి భారతదేశం అంతటా విస్తరిస్తుందని నివేదిక తెలిపింది.

ఇక ఉష్ణ మండల హిందూ మహా సముద్రం యొక్క ఉపరితల ఉష్ణోగ్రత (ఎస్ఎస్‌టీ) 1951-2015 మధ్యకాలంలో సగటున ఒక డిగ్రీ సెల్సియస్ పెరిగింది. అదే సమయంలో ప్రపంచ సగటు కేవలం 0.7 డిగ్రీల సెల్సియస్ మాత్రమే.

మరోవైపు ఉత్తర హిందూ మహాసముద్రం (ఎన్ఐఓ)లో సముద్ర మట్టం 1874-2004ల మధ్య ఏడాదికి 1.06-1.75 మిల్లీమీటర్ చొప్పున పెరిగింది. అలాగే గత రెండున్నర దశాబ్ధాలలో (1993-2017)ల మధ్య ఏడాదికి 3.3 మిల్లీమీటర్ల వేగంతో పెరిగిందని నివేదికలో ప్రస్తావించారు.

21వ శతాబ్ధం చివరిలో ఉత్తర హిందూ మహాసముద్రంలో నీటి మట్టం 1986-2005 ల నాటి సగటుతో పోలిస్తే సుమారు 300 మిల్లీమీటర్లు పెరుగుతుందని అంచనా. కాగా భారతదేశంలో వేసవిలో రుతుపవన వర్షపాతం 1951 నుంచి 2015 మధ్యకాలంలో 6 శాతం తగ్గింది. ప్రధానంగా గంగా- సింధూ మైదానాలు, పశ్చిమ కనుమలపై గణనీయమైన తగ్గుదల నమోదైందని నివేదిక పేర్కొంది.