Asianet News TeluguAsianet News Telugu

భారత్ లో కరోనా: 81వేలు దాటిన కేసులు, 2,649 మరణాలు

గత  24 గంటల్లో దేశంలో 3,722 కేసులు నమోదు కాగా, 100 మంది కోవిడ్ -19 వ్యాధితో మరణించారు. దేశంలో రికవరీ రేటు 33.63 శాతం ఉంది. గత నాలుగు రోజుల్లో 12 వేల కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. 

India coronavirus, COVID-19 live updates, May 15: Coronavirus cases in India surge to 81,970; death toll at 2,649
Author
Hyderabad, First Published May 15, 2020, 9:30 AM IST

భారతదేశంలో కరోనా వైరస్ మహమ్మారికి అడ్డుకట్ట పడడం లేదు. దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 81 వేలు దాటింది. మొత్తం 81,970కేసులు నమోదయ్యాయి. మొత్తం కరోనా వైరస్ 2,649 మరణాలు సంభవించాయి.

దేశంలో ఇప్పటి వరకు 26235 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జీ కాగా, 50వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత  24 గంటల్లో దేశంలో 3,722 కేసులు నమోదు కాగా, 100 మంది కోవిడ్ -19 వ్యాధితో మరణించారు. దేశంలో రికవరీ రేటు 33.63 శాతం ఉంది.

గత నాలుగు రోజుల్లో 12 వేల కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. 

రోజు రోజుకూ కరోనా వైరస్ కేసులు, మరణాలు పెరుగుతూ వస్తున్నాయి. ఢిల్లీలోని ఘాజీపూర్ కూరగాయల మార్కెట్ ను రెండు రోజుల పాటు మూసేయనున్నారు. మార్కెట్ కార్యదర్శికి, డిప్యూటీ కార్యదర్శికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో మార్కెట్ మొత్తాన్ని శానిటైజ్ చేయనున్నారు. 

కరోనా వైరస్ మాసిపోయేది కాదని, హెచ్ఐవి పాజిటివ్ వంటిదేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైఖైలి జె రియాన్ అన్నారు. హెఐవి రూపుమాసిపోలేదని, అలాగే కరోనా వైరస్ కూడా అంతమయ్యేది కాదని అన్నారు. 

ఇదిలా ఉండగా.. దేశంలో లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు కేంద్రం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మరీ ముఖ్యంగా పేద, మధ్య తరగతి కుటుంబీకులను ఆదుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే వలస కూలీలను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంది. వన్ నేషన్ వన్  రేషన్ కార్డు స్కీమ్ ను అమలు చేయనున్నట్టుగా  కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.

దీని ద్వారా దేశంలో ఎక్కడి నుండైనా వలస కార్మికులు రేషన్ తీసుకొనే వెసులుబాటు కలుగుతోందన్నారు మంత్రి.

గురువారం నాడు సాయంత్రం కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడారు. వలస కూలీలు, వీధి కార్మికులపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా  కేంద్ర మంత్రి తెలిపారు. పేదలు, వలస కార్మికులు, రైతుల కోసం 9 పాయింట్లతో కార్యాచరణను ప్రకటిస్తున్నట్టుగా ఆమె చెప్పారు.

మార్చి 28 నుండి సిటీల్లో నిరాశ్రయులైన వాళ్లకు మూడు పూటల బలవర్ధకమైన ఆహారం అందించామని కేంద్ర మంత్రి తెలిపారు.

పట్టణ పేదలకు లక్షా 25 వేల లీటర్ల శానిటైజర్లు, 3 కోట్ల మాస్కులు  అందించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఎస్డీఆర్ఎఫ్ కింద వలస కూలీలకు బస, ఆహారం, తాగు నీరు ఇచ్చామన్నారు. 

ఇక నుండి అసంఘటిత రంగంలో ప్రతి ఒక్కరికి కూడ అపాయింట్ మెంట్ లెటర్లు ఇస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. 

అసంఘటిత రంగంలోని కార్మికులకు ఇక నుండి తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. 

వలస కార్మికులు ప్రభుత్వం నుండి పొందే ప్రయోజనాలను ఎక్కడి నుండైనా తీసుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్రం అన్ని పోర్టబులిటి సౌకర్యాన్ని కల్పించనుందని చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios