చెన్నై: దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళకు బుధవారం నాడు ఎదురుదెబ్బ తగిలింది.

శశికళ కు చెందిన రూ. 2 వేల కోట్ల విలువైన ఆస్తులను బినామీ నిరోధక చట్టం కింద ఆదాయపు పన్ను శాఖాధికారులు బుధవారం నాడు స్థంభింపజేశారు.
ఈ ఆస్తులకు ఆదాయపు పన్ను శాఖాధికారులు బినామీ నిరోధక చట్టం కింద నోటీసులు ఇచ్చారు.

స్థంభింపజేసిన ఆస్తులలలో సిరుతపూర్, కొడనాడులలో రెండు ఆస్తులున్నాయి. వీటి విలువ మొత్తం రూ. 300 కోట్లు. ఈ ఆస్తులు రెండు కూడ శశికళ పేరున ఉన్నాయి.
వచ్చే ఏడాదిలో శశికళ పరప్పర జైలు నుండి విడుదలయ్యే అవకాశం ఉంది. 

తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలోని  సుమారు 65 ఆస్తులను శశికళతో పాటు ఆమె బంధువులకు చెందిన వాటిని ఐటీ శాఖ జప్తు చేసిన విషయం తెలిసిందే.
పోయేస్ గార్డెన్ లో నిర్మాణంలో ఉన్న ఇంటిని కూడ ఐటీ అధికారులు జప్తు చేశారు. జైలు నుండి విడుదలైన తర్వాత ఈ ఇంట్లో ఉండాలని ఆమె భావించింది.

2017లో శశికళతో పాటు ఆమె బంధువుల ఇళ్లపై ఐటీ అధికారులు దాడులు చేశారు. సుమారు 187 ఆస్తులపై దాడి చేసి సుమారు 1430 కోట్ల రూపాయాల పన్ను ఎగవేతకు పాల్పడ్డారని  ఐటీ శాఖ ఆరోపించింది.