చెన్నై:  తమిళనాడులోని మునీశ్వరుడి ఆలయంలో భక్తులు వేడి వేడి మటన్ బిర్యానీని ప్రసాదంగా ఇస్తారు. చాలా కాలం నుండి ఈ ఆలయంలో  ఇదే తరహాలో  బిర్యానీని ప్రసాదంగా ఇస్తున్నారు.

తమిళనాడులోని మధురై జిల్లా తిరుమంగళం సమీపం వడుకంపట్టి గ్రామంలోని మునీశ్వరుడి ఆలయంలో  ప్రతి ఏటా జనవరి 25 జరిగే  ఉత్సవాల్లో వేడి వేడి మటన్ బిర్యానీని ప్రసాదంగా ఇస్తారు. 

గత ఏడాది 2 వేల కేజీల బియ్యం, 200 మేక మాంసంతో బిర్యానీని తయారు చేసి ప్రసాదంగా అందించారు. ఈ ఏడాది కూడ ఇదే తరహలో  స్వామి వారికి బిర్యానీ ప్రసాదాన్ని అందించేందుకు  ఏర్పాట్లు చేశారు. 

 85 ఏళ్ల క్రితం ఎస్వీఎస్‌ సుబ్బానాయుడు మునీశ్వరుడు పేరుతో ప్రారంభించిన హోటల్‌కు లాభాలు రావడంతో ఆ స్వామికి రెండేళ్ల పాటు మటన్‌ బిర్యానీతో నైవేద్యం సమర్పించి భక్తులకు పంచారని, అప్పటి నుంచి గ్రామస్థులంతా కలిసి బిర్యానీ తయారు చేసి ప్రసాదంగా పంపిణీ చేయడం ఆనవాయితీగా మారిందన్నారు. 

రాష్ట్రంలో వందల సంఖ్యలో మునియాండి మాంసాహార హోటళ్లు ఏర్పాటు చేశారు. ఈ నెల 25వ తేదీ తెల్లవారుజామున మునీశ్వరుడి బిర్యానీ నైవేద్యం సమర్పించనున్నారు.