దిగ్బ్రాంతికరం.. 8 సార్లు ట్రాకర్ట్ తో తొక్కించి సోదరుడి హత్య..
ఈ మధ్యకాలంలో చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు అవుతున్నాయి. ఈ క్రమంలో ఒకరినొకరు దూషించుకోవడం, కొట్టుకోవడం. చివరికి హత్య చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా రాజస్థాన్‌లోని భరత్‌పుర్ అనే జిల్లాలో ఇలాంటి దారుణమే చోటుచేసుకుంది.భూ వివాదం విషయంలో ఓ వ్యక్తిని తన సోదరుడిని ట్రాక్టర్‌తో తొక్కించి హత్య చేశాడు. ఈ విషయం స్థానికంగా కలకలం రేపుతోంది.
రాజస్థాన్‌లో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. భూవివాదానికి సంబంధించిన చిన్నపాటి తగాదాతో ఓ వ్యక్తిని ట్రాక్టర్‌తో తొక్కించి హత్య చేయడం కలకలం రేపింది. మరో విషయం ఏంటంటే ఆ వ్యక్తిని చంపిన వ్యక్తి అతని సోదరుడే కావడం గమనార్హం. ఈ దారుణానికి సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇందులో ట్రాక్టర్ డైవర్ ఓ వ్యక్తిని ట్రాక్టర్ తో ఢీ కొట్టి 8 సార్లు తొక్కించి హత్య చేశాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లా బయానా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థలం విషయంలో జరిగిన ఈ ఘటనలో ట్రాక్టర్ ఢీకొని ఒకరు మృతి చెందగా.. దాదాపు డజను మంది గాయపడ్డారు. అందరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బయానా పోలీస్‌స్టేషన్ పరిధిలోని అడ్డా గ్రామంలో బహదూర్‌సింగ్ గుర్జార్, అతర్‌సింగ్ గుర్జార్ అనే కుటుంబాల మధ్య చాలా కాలంగా భూమి విషయంలో వివాదం నడుస్తోంది. మూడు రోజుల క్రితం కూడా రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. దీంతో ఇరువర్గాల వారు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు చేశారు. కాగా.. బుధవారం నాడు బహదూర్ సింగ్ గుర్జార్ కుటుంబానికి చెందిన వారు ట్రాక్టర్‌తో వివాదాస్పద భూమికి చేరుకున్నారు.
వారు ఆ భూమిని దున్నడం ప్రారంభించగా.. ఈ సమాచారం అందుకున్న ఇతర పార్టీ అంటే అతర్ సింగ్ గుర్జార్ కుటుంబ సభ్యులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య గొడవ తారాస్థాయికి చేరుకుంది. ఇరువర్గాల వారు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం ప్రారంభించారు. ఇంతలో దామోదర్ గుర్జర్ ఆగ్రహంతో.. వరుసకు సోదరుడైన నిర్పత్ గుర్జర్‌ను ట్రాక్టర్‌తో ఢీ కొని, తొక్కించాడు. ఒకటి కాదు, రెండు కాదు.. దాదాపు 8 సార్లు నిర్పత్‌ను నిందితుడు ట్రాక్టర్‌తో తొక్కించాడు. అలాగే ఈ ఘటనలో మరికొందరికి గాయాలయ్యాయి.
ఇరువర్గాల మధ్య జరిగిన పోరును చూసేందుకు గ్రామస్థులు పెద్దఎత్తున తరలివచ్చారు. కానీ.. ఆ ఉద్రిక్తతను ఆపేందుకు ఎవరూ ముందుకు రాలేదు. జోక్యం చేసుకునేందుకు బదులుగా అక్కడి వారు తన మొబైల్ ఫోన్‌లలో సంఘటనను వీడియోలు, ఫోటోలు తీశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిర్పత్ గుర్జర్‌ను పదే పదే ట్రాక్టర్‌తో తొక్కించిన తీరు కూడా వీడియోలో కనిపిస్తోంది. ట్రాక్టర్‌తో తొక్కించిన దామోదర్ పరారీలో ఉన్నాడు.
ఈ ఘటనపై బయానా పోలీస్ స్టేషన్ ఏఎస్పీ ఓంప్రకాష్ కల్వానియా మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్ పరిధిలోని అడ్డా గ్రామంలో భూ వివాదంపై ఇరువర్గాల మధ్య గొడవ జరిగినట్లు సమాచారం అందిందని తెలిపారు. దీంతో పోలీసు అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే జరిగిన ఘర్షణలో ట్రాక్టర్‌తో తొక్కించి ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనలో మొత్తం 22 మందిని అదుపులోకి తీసుకున్నామని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.