న్యూఢిల్లీ:ఇండియాలో గత 24 గంటల్లో 3,86,452 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో 1,87,62,976 కి కరోనా కేసులు చేరుకొన్నాయి.  కరోనాతో ఒక్క రోజు వ్యవధిలోనే  3,498 మంది మరణించారు. దీంతో దేశంలో కరోనాతో మరణించినవారి సంఖ్య2,08,330కి చేరాయి.దేశంలో ఇంకా 31,70,228 యాక్టివ్ కేసులున్నాయి.

ఇప్పటికి 1,53,84,418 మంది కరోనా నుండి కోలుకొన్నారు. దేశంలోని ఐదు రాష్ట్రాల్లో కరోనా కేసుల నమోదు అత్యధికంగా నమోదౌతున్నాయి. మహారాష్ట్రలో 66,159 నమోదు కాగా,  కేరళలో 38,607, ఉత్తర్‌ప్రదేశ్ లో 35,104, కర్ణాటకలో 35,024, ఢిల్లీలో 24,235 కేసులు రికార్డయ్యాయి. దేశంలో కరోనా మరణాల రేటు 1.11 శాతానికి చేరుకొంది. కొత్తగా నమోదౌతున్న కేసులతో పాటు రికవరీ కేసుల సంఖ్య కూడ పెరుగుతుందని ఆరోగ్యశాఖాధికారుల గణాంకాలు చెబుతున్నాయి.

రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్ డోసుల కొరత ఉందని కేంద్రానికి ఫిర్యాదులు అందుతున్నాయి. మంగళవారంనాడు ఆయా రాష్ట్రాలకు కేంద్రం కోటి వ్యాక్సిన్ డోసులను విడుదల చేసింది.  ఈ ఏడాది మే 1 నుండి మూడో విడత వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్రం ప్రారంభిస్తోంది. 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేసుకొనే అవకాశాన్ని కేంద్రం కల్పించింది. వ్యాక్సినేషన్ కోసం  యాప్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. దేశంలో కరోనా పరిస్థితులపై  ఇవాళ నిర్వహించనున్న కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు.