అత్తమామలే స్వయంగా కోడలి ఫోటోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ లో చోటుచేసుకుంది. కోడలి ని ఇంటి నుంచి గెంటేసేందుకు వారు ఈ ఫథకం పన్నినట్లు తెలుస్తోంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఘజియాబాద్ కి చెందిన యువతికి వివాహమై.. రెండేళ్ల కొడుకు ఉన్నాడు. ఇటీవల యువతి భర్త రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు. దీంతో.. కొడుకుతో కలిసి అత్తమామల వద్ద ఉంటోంది. కాగా.. కొడుకు పోయాక.. కోడలు మాత్రం భారంగా మాకెందుకు అని భావించిన అత్తమామలు.. కోడలిని హింసించడం మొలుపెట్టారు.

తమ ఇంటి  నుంచి బయటకు వెళ్లాలంటూ బెదిరించడం మొదలుపెట్టారు. అయినా యువతి అత్తారిల్లు వదిలి వెళ్లకపోవడంతో.. ఆమె ఫోటోలను అసభ్యరీతిలో మార్ఫింగ్ చేసి.. ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. అది తెలుసుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. తన మార్ఫింగ్ చేసిన అశ్లీల ఫోటోలతో తన పేరిట నకిలీ ఫేస్‌బుక్ ఖాతాలు తెరచి అత్తమామలే వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.