బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ కుటుంబసభ్యులను మంగళవారం ప్రధాని నరేంద్రమోదీ పరామర్శించారు. జైట్లీ భార్య సంగీత, కుమారుడు రోషన్ లను ప్రధాని ఓదార్చారు. జైట్లీ చనిపోయిన సమయంలో మోదీ విదేశీ పర్యటనలో ఉన్నారు. పర్యటనను ముగుంచుకొని వెంటనే ఇండియా రావాలని భావించారు. అయితే... తమ కోసం పర్యటన రద్దు చేసుకోవద్దని జైట్లీ కుటుంబసభ్యులు మోదీకి వివరించారు. దీంతో.. ఆయన అప్పుడు ఫోన్ లోనే జైట్లీ కుటుంబసభ్యులను ధైర్యంగా ఉండాలని సూచించారు.

మంగళవారం ఉదయం విదేశీ పర్యటనను ముగించుకొని మోదీ ఢిల్లీ చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా జైట్లీ ఇంటికి వెళ్లారు. మోదీ వెంటన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కూడా ఉన్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జైట్లీ శనివారం మధ్యాహ్నం ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.  ఆ సమయంలో మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పర్యటనలో ఉన్నారు.