భారతదేశ సగటు ఉష్ణోగ్రత దాదాపు 0.7 డిగ్రీల సెల్సియస్ పెరిగిందని మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ (MoES)అంచనా వేయబడింది. అలాగే.. శతాబ్ది చివరి నాటికి వేడి తరంగాల తీవ్రత 3-4 రెట్లు పెరిగే అవకాశం ఉందనీ, భారతదేశంలో వాతావరణ మార్పుల వేగంగా సంభవిస్తున్నాయని తెలిపింది.   

భారతదేశ ఉపఖండంలో వాతావరణ మార్పులు వేగంగా చోటుచేసుకుంటున్నాయి. భూతాపం, వాతావరణ మార్పులు కలవరపెడుతున్నాయి. వేసవికాలంలో భరించలేని వడగాల్పులు.. ఆ వెంటనే వర్షకాలంలో ఊహించని ఉత్పాతాన్ని సృష్టించే భారీ వర్షాలు.. ఏకంగా మానవ మనుగడకే సవాల్‌ విసురుతున్నాయి. భారత ఉపఖండంలో చోటుచేసుకుంటున్నా.. ఈ వాతావరణ మార్పులు యావత్ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.

ఇలాంటి విపత్తుకర పరిస్థితులు ఎదుర్కొంటున్న మనిషి ఆలోచనల్లో మార్పు రావడం లేదు. ప్రజల్లో చైతన్యం నింపడంలో పర్యవరణ వేత్తలు, ప్రక్రుతి ప్రేమికులు ప్రయత్నిస్తున్నా ఫలితం లేకుండా పోతుంది. ఇప్పటికైనా తగు చర్యలు తీసుకోవాలని మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ (MoES) నివేదిక హెచ్చరిస్తోంది.

మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ (MoES) 2020లో 'భారతదేశంలో వాతావరణ మార్పుల అంచనా (Assessment of Climate Change over the Indian Region) అనే నివేదికను ప్రచురించింది. ఇందులో భారత ఉపఖండంపై వాతావరణ మార్పులను సమగ్ర అంచనా వేసింది. ఈ నివేదికలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

1901-2018 సమయంలో భారతదేశ సగటు ఉష్ణోగ్రత దాదాపు 0.7 డిగ్రీలు పెరిగిందని పేర్కొంది. అలాగే.. 1950-2015లో రోజువారీ వర్షపాతం తీవ్రత (వర్షపాతం తీవ్రత > 150 మిమీ) 75% పెరిగిందని తెలిపింది. అదే సమయంలో భారతదేశంలో కరువుల పరిస్థితులు పెరిగాయని నివేదించింది. ఉత్తర హిందూ మహాసముద్రంలో సముద్ర మట్టం కూడా పెరిగిందనీ, గత రెండున్నర దశాబ్దాలలో (1993-2017) 3.3 మి.మీ. పెరిగినట్టు సూచించింది. ఇదిలా ఉంటే.. 1998-2018 మధ్యకాలంలో అరేబియా సముద్రంలో తరుచు తుఫానులు సంభవిస్తున్నాయని హెచ్చరించింది.

భారత వాతావరణ శాఖ (IMD) భారతదేశ వాతావరణాన్ని మామూలుగా పర్యవేక్షిస్తుంది. "వార్షిక వాతావరణ సారాంశం" అనే పేరిట వార్షిక ప్రచురణను విడుదల చేస్తుంది. అలాగే.. IMD నెలవారీ వాతావరణ నివేదికలను కూడా జారీ చేస్తుంది. వార్షిక వాతావరణ సారాంశం సంబంధిత కాలంలో సంభవించే ఉష్ణోగ్రత, వర్షపాతం, తీవ్రమైన వాతావరణ సంఘటనల గురించి సమాచారాన్ని అందిస్తోంది. వాతావరణ మార్పులపై పలునేతలు అడిగిన ప్రశ్నకు కేంద్ర భూ శాస్త్రాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.