తెలంగాణలో 17, మహారాష్ట్రలో 48 ఎంపీ స్థానాలను బీఆర్ఎస్ గెలిస్తే.. కేంద్రం మెడలు వంచవచ్చునని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ రూపంలోనైనా దేశానికి నాయకత్వం వహించే అవకాశం వస్తుందని వివరించారు. 

హైదరాబాద్: టీఆర్ఎస్.. బీఆర్ఎస్ మారిన తర్వాత మహారాష్ట్రలో విస్తరణ వేగం పెరిగింది. మహారాష్ట్రలో గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి నేతలు బీఆర్ఎస్‌లో చేరుతున్నారు. తాజాగా, సోలాపూర్ నియోజకవర్గంలోని పలు గ్రామాల సర్పంచులు సోమవారం బీఆర్ఎస్‌లో చేరారు. తెలంగాణ భవన్‌ల నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ స్వయంగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో 17, మహారాష్ట్రలో 48 ఎంపీ స్థానాల్లో బీఆర్ఎస్ గెలిస్తే.. మొత్తం 65 మంది ఎంపీలు పార్టీ వద్ద ఉంటారని సీఎం కేసీఆర్ అన్నారు. 65 మంది ఎంపీలతో కేంద్రం మెడలు వంచలేమా? అంటూ అడిగారు. ఈ రకంగానైనా దేశానికి నాయకత్వం వహించే అవకాశం మహారాష్ట్రకు ఉన్నదని సీఎం అన్నారు.

త్వరలో బుల్దానా జిల్లా నుంచి సుమారు 100 మంది సర్పంచులు బీఆర్ఎస్‌లో చేరుతున్నట్టు తెలిపారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్‌కు మంచి ఆదరణ లభిస్తున్నదని కేసీఆర్ వివరించారు. ఈ ఆదరణ చూస్తే మాత్రం మహారాష్ట్రలో వంద శాతం ప్రభుత్వం ఏర్పాటు చేసి తీరుతామని కేసీఆర్ తెలిపారు .

ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, పల్లా రాజేశ్వర్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.