ప్రేమ పేరుతో ఓ యువకుడు ఐఏఎస్ అధికారి కుమార్తెను ట్రాప్ చేశాడు. తీరా పెళ్లి దాకా వచ్చే సరికి మాత్రం నాకు సంబంధం లేదు అంటూ చేతులు ఎత్తేశాడు. దీంతో... మోసపోయానని గుర్తించిన యువతి పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.... చెన్నై విరుగంబాక్కంలోని అపార్ట్‌మెంట్‌లో ఐఏఎస్‌ అధికారి ఒకరు నివశిస్తున్నారు. ఈయన 20 ఏళ్ల కుమార్తె అన్నానగర్‌లోని ఒక ప్రముఖ పాఠశాలలో ప్లస్‌టూ వరకు పూర్తిచేసింది. అదే పాఠశాలలో ఆమెతో పాటు ఇర్ఫాన్‌ (21) అనే విద్యార్థి చదివాడు. పాఠశాల నుంచి ఇరువురూ స్నేహంగా మెలిగారు. ఆమెను వివాహం చేసుకుంటానని తెలుపుతూ వచ్చిన అతను హఠాత్తుగా నిరాకరించినట్లు సమాచారం.

దీంతో ఐఎఎస్‌ అధికారి కుమార్తె ఆదివారం మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇర్ఫాన్‌ లెదర్‌ గార్మెంట్స్‌ బిజినెస్‌ చేస్తున్నాడు. కళాశాల విద్యార్థి కూడా. టీ.నగర్‌ డిప్యూటీ కమిషనర్‌ అశోక్‌కుమార్‌ ఇర్ఫాన్‌ను విచారించారు. దీనిపై వడపళని మహిళా పోలీసు స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌కు విచారణ చేయాలని ఉత్తర్వులిచ్చారు. ఐఏఎస్‌ అధికారి కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు 417, 420, 406, 506 (1) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.