ప్రధానిగా నరేంద్రమోడీకి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ షాకిచ్చారు. పార్టీ పరంగా ఎన్ని విభేదాలు ఉన్నా రాజ్యాంగ సాంప్రదాయాన్ని అనుసరించి మోడీ ప్రమాణ స్వీకారానికి హాజరవుతానని ఆమె చెప్పారు. అయితే తాజాగా దీదీ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.

మరోసారి ప్రధాని పదవి పగ్గాలు చేపడుతున్న నరేంద్రమోడీకి అభినందనలు.. రాజ్యాంగ సాంప్రదాయం ప్రకారం వచ్చిన ఆహ్వానాన్ని అంగీకరించి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలని తాను అనుకున్నాను.

కానీ బెంగాల్‌లో రాజకీయ ఘర్షణలు జరిగి 54 మంది హత్యకు గురయ్యారని బీజేపీ చెబుతున్నట్లు గంట నుంచి మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇది పూర్తిగా అవాస్తవం.. బెంగాల్‌లో ఎలాంటి రాజకీయ హత్యలు జరగలేదు.. వ్యక్తిగత కక్షలు, కుటుంబ తగదాలు, ఇతర గొడవల వల్లే ఆ మరణాలు చోటు చేసుకున్నాయి.

వాటికి రాజకీయాలతో సంబంధం లేదు.. అలా ఉన్నట్లు మా వద్ద ఎలాంటి రికార్డులు కూడా లేవు. అయితే మీడియా కథనాలతో నేను ప్రమాణ స్వీకారానికి రాలేకపోతున్నాయి...ఐయామ్ సారీ నరేంద్రమోడీ జీ.. ప్రమాణ స్వీకారం అంటే ప్రజాస్వామ్య పండగ... రాజకీయ ప్రయోజనాల కోసం దాని విలును తగ్గించొద్దు.

దయచేసి నన్ను క్షమించండి అంటూ దీదీ ప్రధానికి లేఖ రాశారు. అంతేకాకుండా దానిని ట్వీట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ, తృణమూల్ కార్యకర్తలు భౌతిక దాడులకు దిగారు.

ఈ ఘటనల్లో దాదాపు 50 మందికి పూగా బీజేపీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. వీరికి అండగా నిలబడాలని నిర్ణయించుకున్న ప్రధాని.. తన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు.. వీరిని ప్రత్యేక ఆహ్వానితులుగా పిలిచామని తెలిపారు. ఈ క్రమంలో మమత తన నిర్ణయాన్ని మార్చుకోవడం హాట్ టాపిక్‌గా మారింది.