అహ్మదాబాద్: తన భర్త 20 రోజులుగా కనిపించడం లేదని పాటిదార్ నేత హార్దిక్ పటేల్ భార్య కింజల్ పటేల్ ఆరోపించారు. తన భర్తను గుజరాత్ పాలనా యంత్రాంగం టార్గెట్ చేసిందని ఆమె ఆరోపించారు. ఆయన ఎక్కడ ఉన్నాడనే విషయంపై ఏ మాత్రం సమాచారం లేదని ఆమె అన్నారు. 

హార్దిక్ పటేల్ తమ వద్ద లేకపోవడం చాలా బాధగా ఉందని, ఈ విధమైన ఎడబాటును హార్డిక్ పటేల్ భరించగలరా అనేది ప్రజలు ఆలోచించాలని ఆమె అన్నారు. ఈ మేరకు ఆమె ఓ వీడియోను ఇంటర్నెట్ లో షేర్ చేశారు. 

పాటిదార్లపై పెట్టిన కేసులను అన్నింటిని ఉపసహరించుకుంటామని 2017లో ప్రభుత్వం చెప్పిందని, ఆ తర్వాత హార్దిక్ పటేల్ ను ఒక్కడినే టార్గెట్ చేస్తూ వస్తోందని, బిజెపిలో చేరిన మరో ఇద్దరు పాటిదార్ ఉద్యమకారులను వదిలేస్తున్నారని ఆమె అన్నారు. 

హార్దిక్ పటేల్ ప్రజలను కలుస్తూ వారితో మమేకం కావడం, వారి సమస్యలను లేవనెత్తడం ప్రభుత్వానికి ఇష్టం లేదని ఆమె అన్నారు. 

హార్దిక్ పటేల్ ఎక్కుడున్నాడనే సమాచారం లేనప్పటికీ ఆయన ఈ నెల 11వ తేదీన ఆసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన అరవింద్ కేజ్రీవాల్ కు ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు 10వ తేదీన పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తనను జైలులో పెట్టాలని చూస్తున్నారని సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. 

నాలుగేళ్ల క్రితం గుజరాత్ పోలీసులు తనపై తుప్పుడు కేసులు బనాయించారని, తనపై ఉన్న కేసుల వివరాలు ఇవ్వాలని తాను లోకసభ ఎన్నికల సమయంలో అహ్మాదాబాద్ పోలీసు కమిషనర్ ను అడిగానని, ఆ కేసులు తనపై లేవని ఆయన ట్విట్టర్ లో చెప్పారు. తనను అదుపులోకి తీసుకోవడానికి 15 రోజుల క్రితం పోలీసులు తమ ఇంటికి వచ్చారని, కానీ తాను ఇంట్లో లేనని ఆయన చెప్పారు.