తమిళనాడు: ప్రభుత్వం ఇచ్చిన వివాహ కానుక ఆ పచ్చని కాపురంలో చిచ్చుపెట్టింది. నిండుగర్భిణీని బలితీసుకుంది. భార్యకు ఇచ్చిన కానుకను తనకు ఇవ్వాలని భర్త కోరగా అందుకు ఆమె అంగీకరించకపోవడంతో ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఆగ్రహం చెందిన భర్త భార్యను కడతేర్చాడు. 

వివరాల్లోకి వెళ్తే తమిళనాడులోని సేలం జిల్లా జలకంఠాపురం సమీపంలోని కరిక్కాపట్టి గ్రామానికి చెందిన రాజవేల్ కు అదే గ్రామానికి చెందిన భువనేశ్వరితో ఏడాది క్రితం వివాహమైంది. వీరి వివాహానికి ప్రభుత్వం ఒక సవరం బంగారు నాణెంను కానుకగా అందజేసింది. ప్రస్తుతం భువనేశ్వరి మూడు నెలల గర్భవతి. 
 
అయితే ప్రభుత్వం ఇచ్చిన ఒక సవరం బంగారు నాణెన్ని భువనేశ్వరి తన తల్లి సంధ్య వద్ద ఉంచింది. మరుసటి రోజే భువనేశ్వరి తండ్రి చంద్రన్ కొత్త బైక్ కొనుగోలు చేశాడు. విషయం తెలుసుకున్న భువనేశ్వరి భర్త రాజవేల్ తన భార్యకు ఇచ్చిన కానుకతోనే బైక్ కొనుగోలు చేశారని అనుమానించాడు. 

ఇంటికి వెళ్లి భార్యను ప్రభుత్వం అందించిన వివాహ కానుక ఇవ్వాలని కోరాడు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆగ్రహం చెందిన రాజవేల్ భువనేశ్వరిని కిందకి తోసేయ్యడంతో ఆమె తలకు తీవ్ర గాయమైంది. ఆ తర్వాత దిండుతో ఆమె ముఖాన్ని అదిమిపట్టి తాడుతో గొంతు నులిమి హత్య చేశాడు.  

తాను చేసిన హత్యను కప్పిపుచ్చుకునేందుకు భువనేశ్వరి ఆత్మహత్య చేసుకుందని నమ్మించే ప్రయత్నం చేశాడు. అందర్నీ నమ్మించి అంత్యక్రియలకు ఏర్పాటు చేశాడు. అల్లుడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన భువనేశ్వరి తల్లి సంధ్య జలకంఠాపురం పోలీసులను ఆశ్రయించింది.  

రంగంలోకి దిగిన పోలీసులు భువనేశ్వరి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు పంపించారు. పోస్టుమార్టం నివేదికలో ఆమె హత్యకు గురైనట్లు తేలింది. పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగా రాజవేల్ ను తమదైన శైలిలో పోలీసులు విచారించగా అసలు విషయం చెప్పాడు. 

తానే తన భార్య భువనేశ్వరిని హత్య చేసినట్లు నేరం అంగీకరించాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిని కోర్టు ఎదుట హాజరుపరిచారు. కాగా రాజవేల్ కు కోర్టు రిమాండ్ విధించింది.