కట్టుకున్న భర్తను కాదని ఎదురింటి కుర్రాడిని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది ఓ భార్య. ఇది తట్టుకోలేక భర్త ఫేస్ బుక్ లైవ్ లో ఆత్మహత్య చేసుకున్న ఘటన బీహార్ లో కలకలం రేపింది. 

బీహార్‌ అరారియాలోని సిమ్రాహ్ లో హేమంత్ గుప్తా, భార్య మున్నీదేవితో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో మున్నీదేవికి ఎదురింటి కుర్రాడు రాకేష్ సాహ్‌తో పరిచయం ఏర్పడింది. ఇది కాస్తా వారిద్దరి మధ్య ప్రేమ(?)కు దారితీసింది. భర్తకు తెలియకుండా వీరిద్దరూ రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి కూడా చేసుకున్నారు.

ఈ విషయం తెలిసిన హేమంత్ గుప్తా షాక్ అయ్యాడు. భార్య చేసిన పనికి అవమానంతో కుంగిపోయాడు. చచ్చిపోవాలనుకున్నాడు. చనిపోయేముందు పేస్ బుక్ లో తన బాధను లైవ్ చేశాడు. తన భార్య రాకేష్ సాహ్‌ను రిజిస్ట్రర్ మ్యారేజ్ చేసుకుందని, దీనిని తట్టుకోలేకపోతున్నానని ఏడ్చేశాడు. అందుకే ఆత్మహత్య చేసుకోబోతున్నానని, తన మరణం తరువాతైనా న్యాయం చేయాలని కోరాడు. 

లైవ్ చూసిన వాళ్లు వెంటనే అతని ఇంటికి వచ్చేసరికి అప్పటికే హేమంత్ విషం మింగేశాడు. అపస్మారక స్థితిలో ఉన్నాడు. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే హేమంత్ చనిపోయినట్టుగా డాక్టర్లు తెలిపారు. విషయం తెలిసిన హేమంత్ భార్య తన కొత్త భర్తతో పాటు పరారయ్యింది. 

విస్మయపరిచే ఈ ఘటనలో పోలీసులు కేసు నమోదు చేసుకుని మున్నీదేవి, రాకేష్ ల కోసం గాలింపు చేపట్టారు.  హేమంత్ మృత దేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి, దర్యాప్తు ప్రారంభించారు.