న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. మరికొద్ది గంటల్లో కౌంటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను బుధవారంనాడు అప్రమత్తం చేసింది. 

దేశంలోని పలు ప్రాంతాల్లో హింస జరిగే అవకాశాలున్నందున రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు, డీజీపీలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజాభద్రతకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తగు చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం శాఖ సూచించింది. 

స్ట్రాంగ్‌ రూమ్‌లు, ఓట్ల లెక్కింపు జరిగే చోట్ల తగినన్ని భద్రతా చర్యలు చేపట్టాలని కూడా ఆదేశించింది. 542 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకూ ఏడు విడతల్లో ఎన్నికలు జరగ్గా మే 23న ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ ఎన్నికల్లో 542 స్థానాలకు సుమారు 8వేల మంది వరకు పోటీ చేశారు.