హిజాబ్ (Hijab) వివాదంపై సుప్రీం కోర్టులో కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ (Kapil Sibal) పిటిషన్ దాఖలు చేశారు. హిజాబ్‌కు సంబంధించిన కేసులను కర్ణాటక హైకోర్టు నుంచి సుప్రీం కోర్టుకు బదిలీ చేయాలని అందులో కోరారు.
హిజాబ్ (Hijab) వివాదంపై సుప్రీం కోర్టులో కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ (Kapil Sibal) పిటిషన్ దాఖలు చేశారు. హిజాబ్‌కు సంబంధించిన కేసులను కర్ణాటక హైకోర్టు నుంచి సుప్రీం కోర్టుకు బదిలీ చేయాలని అందులో కోరారు. ‘పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి. ఆడపిల్లలను రాళ్లతో కొడుతున్నారు. ఈ సమస్యను పరిగణనలోకి తీసుకోవడం అవసరం. ఇది ఇప్పుడు మొత్తం దేశానికి విస్తరిస్తోంది’ అని సిబల్ అన్నారు. అయితే ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు తెలిపింది. కర్ణాటక హైకోర్టులో ఈరోజు విచారణకు వస్తుందని.. ఈ దశలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. హైకోర్టు పరిశీలించి నిర్ణయం తీసుకోనివ్వండి అని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.
‘ఈ విషయాన్ని హైకోర్టు విననివ్వండి. ఈరోజు అది ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ ముందు జాబితా చేయబడింది. ఈ దశలో మేము దానిని చేపట్టడం చాలా తొందరపాటు అవుతుంది. హైకోర్టు ఏదైనా interim relief ఇస్తుందో చూద్దాం’ అని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.
ఇక, కర్ణాటకలో గత కొన్ని రోజులుగా హిజబ్‌పై వివాదం జరుగుతున్నది. ఉడుపిలోని ఓ కాలేజ్‌లో మొదలైన హిజాబ్ వివాదం.. క్రమంగా కర్ణాటక వ్యాప్తంగా విస్తరించింది. హిజాబ్ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా విద్యార్థులు ఆందోళనలకు దిగుతుండటం ఉద్రిక్త పరిస్థితులకు దారితిసింది. హిజబ్‌పై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ పలువురు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్ట్ సింగిల్ బెంచ్ న్యాయమూర్తి కృష్ణ దీక్షిత్ బుధవారం ఈ పిటిషన్‌పై విచారణ జరిపారు. హిజబ్‌పై పిటిషన్లు తప్పుదారి పట్టించేలా ఉన్నాయని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. రాజ్యాంగం, ముస్లిం పర్సనల్ చట్టం ప్రకారం చాలా అంశాలకు సంబంధించిన ప్రశ్నలను చర్చించాల్సి ఉందని సింగిల్ బెంచ్ అభిప్రాయపడింది. ఈ విషయమై విస్తృత ధర్మాసనం అవసరమని భావిస్తున్నామని జడ్జి కృష్ణ దీక్షిత్ తెలిపారు.
ఈ క్రమంలోనే కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రీతూ రాజ్ అవస్తీ తనతో పాటు జస్టిస్ కృష్ణ దీక్షిత్, జస్టిస్ జేఎం ఖాజీలతో కూడిన ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. ఇది గురువారం కర్ణాటక హిజాబ్ రో కేసును విచారిస్తుంది.
