హిజాబ్‌ వివాదంపై కర్ణాటక హైకోర్టు (Karnataka High Court) విచారణ కొనసాగుతుంది. క్లాస్‌రూమ్‌లో హిజాబ్ (Hijab) ధరించడానికి అనుమతి కోరుతూ దాఖలైన పిటిషన్లపై కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ రీతూ రాజ్ అవస్తీ, జస్టిస్ జెఎం ఖాజీ, జస్టిస్ కృష్ణ ఎం దీక్షిత్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతుంది. 

హిజాబ్‌ వివాదంపై కర్ణాటక హైకోర్టు (Karnataka High Court) విచారణ కొనసాగుతుంది. క్లాస్‌రూమ్‌లో హిజాబ్ (Hijab) ధరించడానికి అనుమతి కోరుతూ దాఖలైన పిటిషన్లపై కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ రీతూ రాజ్ అవస్తీ, జస్టిస్ జెఎం ఖాజీ, జస్టిస్ కృష్ణ ఎం దీక్షిత్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతుంది. మంగళవారం విచారణ సందర్భంగా హిజాబ్ నిషేధానికి వ్యతిరేకంగా పిటిషన్‌లు దాఖలు చేసిన బాలికల తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది.. హిజాబ్‌తో పాఠశాలలు, కళాశాలలకు హాజరు కావాలనుకునే ముస్లిం బాలికలకు కొంత సడలింపు ఇవ్వాలని హైకోర్టు ధర్మాసనాన్ని అభ్యర్థించారు. 

కర్ణాటక ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ ప్రభులింగ్ నవాద్గీ వాదనలు కొనసాగించారు. క్యాంపస్‌లో హిజాబ్ ధరించడంపై ఎలాంటి ఆంక్షలు లేవని అడ్వకేట్ జనరల్ ప్రభులింగ్ నవాద్గీ కోర్టుకు తెలిపారు. అయితే క్లాస్‌రూమ్ లోపల మాత్రమే ఆంక్షలు ఉంటాయని చెప్పారు. ‘ఇది క్లాస్ రూమ్స్‌లో.. తరగతులు జరిగే సమయాల్లో మాత్రమే.. ఇది మతంతో సంబంధం లేకుండా అందరికీ ఒకే విధంగా వర్తిస్తుంది’ అని చెప్పారు. 

‘మానవ గౌరవం స్వేచ్ఛను కలిగి ఉంటుంది. హిజాబ్ ధరించాలా వద్దా అనే ఎంపిక ఉంటుంది. పిటిషనర్ యొక్క మొత్తం క్లెయిమ్ బలవంతం చేయాలనేది.. ఇది రాజ్యాంగ ధర్మానికి విరుద్ధంగా ఉంది. హిజాబ్ తప్పనిసరి కాదు.. సంబంధిత మహిళల ఎంపికకు వదిలివేయాలి’ అని అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. మతం ఆధారంగా ఎలాంటి వివక్ష లేదని.. మహిళల గౌరవాన్ని గుర్తుంచుకోవాలని ఏజీ చెప్పారు. ప్రైవేట్ అన్ ఎయిడెడ్ మైనారిటీ సంస్థల విషయానికొస్తే యూనిఫాం కోడ్‌లో జోక్యం చేసుకోవడం లేదన్నారు. దానిని నిర్ణయించే సంస్థలకు వదిలివేస్తామని తెలిపారు. 

‘మహిళా సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్ద సంఖ్యలో పిటిషనర్లు.. మహిళల గౌరవాన్ని గుర్తుంచుకోవాలని నేను వారికి చెప్పాలనుకుంటున్నాను’ అని ఏజీ చెప్పారు.

ఈ వారంలోనే విచారణ పూర్తి చేయాలని భావిస్తున్నాం.. హైకోర్టు
 మంగళవారం హిజాబ్ సంబంధిత కేసును ఈ వారంలోనే పరిష్కరించాలనుకుంటున్నట్లు పేర్కొంది. ఇందుకోసం అన్ని పక్షాల సహకారాన్ని కోరింది. ‘మేము ఈ వారంలోనే ఈ కేసును ముగించాలనుకుంటున్నాము. ఈ వారం చివరి నాటికి ఈ కేసును పూర్తి చేయడానికి అన్ని ప్రయత్నాలు చేయండి’ అని చీఫ్ జస్టిస్ రీతూ రాజ్ అవస్తీ అన్నారు.