శబరిమలకు ఒక్కరోజే లక్షమంది దర్శనం.. పోటెత్తిన భక్తులు...
శబరిమలకు భక్తులు పోటెత్తారు. వారాంతాలు కావడంతో రెండు రోజులుగా రోజుకు లక్ష మంది భక్తులు దర్శనం చేసుకున్నారు.

శబరిమల : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమల భక్తుల తాకిడితో కిటకిటలాడుతోంది. కొండ మొత్తం అయ్యప్ప నామస్మరణతో మార్మోగి పోతోంది. ఆదివారం ఒక్కరోజే అయ్యప్ప కొండకు సుమారు లక్ష మంది భక్తులు పోటెత్తారు. లక్షల మంది దర్శించుకున్న క్యూలైను అలాగే ఉండడంతో శబరిమలలో భక్తుల రద్దీని ఇది తెలుపుతుందని ఆలయ అధికారులు అంటున్నారు. భక్తుల రద్దీ కారణంగా పంబ నుంచి శబరిమల కొండకు వెళ్లేందుకు 10 గంటల సమయం పడుతోంది. దీంతో భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
కొండ క్రింద ఎటుచూసినా భక్తులే కనిపిస్తున్నారు. ఇసకేస్తే రాలనంతగా జనాలు శబరిమల కొండకు పోటెత్తారు. భక్తుల రద్దీ అంతగా ఉన్నా కూడా అధికారులు అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అన్నదానం, మంచినీటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఇక, శనివారం నాడు కూడా శబరిమల అయ్యప్ప ఆలయానికి దాదాపు లక్ష మంది యాత్రికులు దర్శించుకున్నారు. దీంతో రద్దీ ఎక్కువగా ఉంది. భక్తులు రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయ అధికారులు మరో 30 నిమిషాల పాటు ఆలయాన్ని తెరిచి ఉంచవలసి వచ్చింది. ఇక శుక్రవారం 97,310 మంది యాత్రికులు శబరిమలకు వచ్చారు.