బెంగళూరులో వర్షం దంచికొడుతుంది. ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నగరంలోని అనేక ప్రాంతాలు జలదిగ్భంధంలో చిక్కుకుపోయాయి. బెల్లందూర్, సర్జాపురా రోడ్, వైట్‌ఫీల్డ్, ఔటర్ రింగ్ రోడ్, బీఈఎంఎల్ లేఅవుట్.. ప్రాంతాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. 

బెంగళూరులో వర్షం దంచికొడుతుంది. ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నగరంలోని అనేక ప్రాంతాలు జలదిగ్భంధంలో చిక్కుకుపోయాయి. బెల్లందూర్, సర్జాపురా రోడ్, వైట్‌ఫీల్డ్, ఔటర్ రింగ్ రోడ్, బీఈఎంఎల్ లేఅవుట్.. ప్రాంతాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. చాలా చోట్ల రహదారులు జలమయమయ్యాయి. కొన్ని చోట్ల ఔటర్ రింగ్ రోడ్డుపై భారీగా వరద నీరు చేరింది. దీంతో బెంగళూరు శివార్లలో ఉన్న ఐటీ పార్కులకు నగరాన్ని కలుపుతున్న ఔటర్ రింగ్ రోడ్డుపై ట్రాఫిక్ ఎక్కువగా ప్రభావితమైంది. దీంతో ఆఫీసులకు వెళ్లే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

సోమవారం ఉదయం నుంచి కొన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తూనే ఉంది. దీంతో ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని పోలీసులు ప్రజలను కోరారు. భారీ వర్షాల కారణంగా బెంగళూరులోని మారతహళ్లి-సిల్క్ బోర్డ్ జంక్షన్ రోడ్డుపై భారీ ట్రాఫిక్ జామ్ అయింది. పెద్ద సంఖ్యలో వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయి. మారతహళ్లి-సిల్క్‌బోర్డ్‌ జంక్షన్‌ రోడ్డు సమీపంలో వరద నీటిలో చిక్కుకుపోయిన ఓ వ్యక్తిని స్థానిక సెక్యూరిటీ గార్డులు రక్షించారు.

భారీ వర్షాల నేపథ్యంలో బృహత్ బెంగళూరు మహానగర పాలిక హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేసింది. వర్షాల నేపథ్యంలో సాయం కావాల్సిన వారు.. టోల్ ఫ్రీ నంబర్ 1533కు కాల్ చేయవచ్చని తెలిపింది. జోనల్ హెల్ప్‌లైన్ నంబర్‌లతో పాటు 24×7 హెల్ప్‌లైన్ (2266 0000), వాట్సాప్ హెల్ప్‌లైన్ (94806 85700) కూడా అందుబాటులో ఉంచింది. 

ఇక, భారీ వర్షాలతో బెంగళూరులో నెలకొన్న పరిస్థితులను పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఓ నెటిజన్ షేర్ చేసిన వీడియోలో.. మారతహళ్లిలోని స్పైస్ గార్డెన్ ప్రాంతంలో వరదనీటిలో తేలియాడుతూ కనిపించాయి. 

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. వరద బాధితులకు సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉంటే.. కర్ణాటక వ్యాప్తంగా సెప్టెంబర్ 9 వరకు ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది.