Asianet News TeluguAsianet News Telugu

తమిళనాడులో భారీ వర్షాలు: విద్యా సంస్థలకు సెలవు, రంగంలోకి ఎన్‌డీఆర్ఎఫ్

తమిళనాడు రాష్ట్రంలో  రెండు రోజులుగా  వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ కూడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున  రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

 Heavy rains lash Tamil Nadu, holiday declared for schools on Nov 15 lns
Author
First Published Nov 15, 2023, 10:09 AM IST


చెన్నై:తమిళనాడు రాష్ట్రంలో  భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో  బుధవారంనాడు  రాష్ట్రంలో విద్యా సంస్థలకు  ప్రభుత్వం  సెలవు ప్రకటించింది.రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.  ఈ నెల  14న  తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ తీర ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది.

మంగళవారం కూడ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలతో పెద్దగా నష్టం జరగలేదని  ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. చెన్నైతో పాటు ఇతర ప్రాంతాల్లో  లోతట్టు ప్రాంతాల్లో  వర్షం నీరు నిలిచిపోయింది.

ఈ ఏడాది అక్టోబర్ లో తక్కువ వర్షపాతం నమోదైంది.  తమిళనాడులో 42 శాతం  లోటు వర్షపాతం నమోదైంది.  మంగళవారం నాడు చెన్నైలోని నుంగంబాక్కం, మీనంబాక్కం స్టేషన్లలో  25 మి.మీ. నుండి  35 మి.మీ. వర్షపాతం నమోదైంది. అక్టోబర్ నుండి ఇప్పటివరకు  చెన్నైలో  కేవలం 19 సెం.మీ వర్షపాతం మాత్రమే నమోదైందని  విపత్తు నిర్వహణ మంత్రి రామచంద్రన్ చెప్పారు.

భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో  అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా  మంత్రి రామచంద్రన్ చెప్పారు.  రాష్ట్ర వ్యాప్తంగా  4900 పైగా సహాయ శిబిరాలను ఏర్పాటు చేసినట్టుగా ఆయన తెలిపారు. రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లోని విద్యా సంస్థలకు  ఇవాళ  సెలవును ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

మంగళవారంనాటికి రాష్ట్రంలో  అత్యధికంగా  నాగపట్నం జిల్లాలో  17 సెం.మీ. వర్షపాతం నమోదైంది.  కడలూరులో  12 సెం.మీ. వర్షపాతం రికార్డైంది.

తమిళనాడులోని కడలూరు, మైలదుత్తురై, నాగపట్నం,తిరువారూర్, రామనాథపురం, పుదుచ్చేరిలోని కారైకాల్ లో 55 కి.మీ వేగంతో  గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ కూడ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని  ఐఎండీ తెలిపింది.

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ మంగళవారంనాడు చెన్నైలోని  స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ లో పనులను పరిశీలించారు. కడలూరు, మైలాడుతురై, నాగపట్నం ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో  ఈ జిల్లాలకు  మంత్రులను ఇంచార్జీలుగా నియమించి సహాయక చర్యలను పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు.అంతేకాకుండా  13 జిల్లాల్లో  ఐఎఎస్ అధికారులను నియమించారు. తిరునెల్వేలి, కోయంబత్తూరు, తిరుచ్చి జిల్లాల్లో  400 మంది ఎన్ డీ ఆర్ఎఫ్, చెన్నెలో  200 మంది ఎన్ డీ ఆర్ ఎఫ్ సిబ్బందిని  నియమించారు. తమిళనాడు, పుదుచ్చేరిలలోని  31 ప్రాంతాల్లో మంగళవారం నాడు భారీ వర్షపాతం నమోదైంది.

Follow Us:
Download App:
  • android
  • ios